ప్రతి సమస్యకు ఒక మొదలు అనేది ఉంటుంది. గుండె సమస్యలకు కూడా. ఆధునిక జీవన శైలి, ఒత్తిడి, తినే ఆహారం, పుట్టుకతోనే వచ్చిన గుండె జబ్బులు, మధుమేహం, మానసిక ఒత్తిడి, ఊబకాయం... ఇలా ఏవైనా కూడా గుండె జబ్బుకు దారితీసే  ప్రయాణంలో మొదటి మెట్టు కావచ్చు. గుండె పనితీరులో మార్పు రాగానే, అది మన శరీరానికి కొన్ని హెచ్చరికలను పంపిస్తుంది. వాటిని మనం గమనించుకుని ముందే జాగ్రత్త పడొచ్చు. 


1. చాలా ఆందోళనగా అనిపించడం, గుండె దడ
గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు ఆందోళను, గుండెదడకు తరచూ గురవతుంటారు. జీవితంలో తీవ్రమైన మానసిక ఆందోళనలు ఉన్నవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆందోళనల వల్ల గుండె కొట్టుకునే వేగంలో మార్పు వస్తుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. దీన్నే గుండె దడ అంటారు. ఇలా క్రమరహితంగా కొట్టుకునే గుండె వల్ల ఆ వ్యక్తులు గుండె సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. 


2.  ఎడమ భుజంలో నొప్పి
చాలా మంది గుండె పోటుకు గురయ్యే ముందు ఛాతీ మధ్య భాగంలో చాలా ఇబ్బందిగా, నొప్పిగా అనిపిస్తున్నట్టు చెప్పారు. ఆ నొప్పి భుజాలకు, మెడకు, దవడలకు కూడా పాకినట్టు తెలిపారు. ముఖ్యంగా ఎడమ భుజంలో నొప్పి కలగడం గుండె పోటు కలగవచ్చని చెప్పడానికి ముఖ్య ముందస్తు హెచ్చరికగా చెప్పుకోవచ్చు.  అమెరికాన్ హార్ట్ అసోసియేషన్ చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా ఎడమభుజంలో నొప్పి నిమిషాల్లో పెరిగిపోతుంటే, వెంటనే ఆసుపత్రికి వెళ్లడం ఉత్తమం. 


3. వికారం, ఆకలి తగ్గడం
 అజీర్ణం, కడుపునొప్పి, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు కూడా హృదయ సంబంధ వ్యాధులతో ముడిపడి ఉన్నాయి. ఇవి సాధారణమైన జీర్ణసంబంధసమస్యల్లా కనిపిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. 


4. మైకం కమ్మినట్టు అనిపించడం
గుండె సంబంధ సమస్యలు ఉన్నవారిలో బలహీనంగా అనిపించడం, తలంతా హఠాత్తుగా తేలికగా అనిపించడం, కిందపడిపోతామేమో అన్న ఫీలింగ్ రావడం వంటివి కలుగుతాయి. అలాగే చల్లని చెమట కూడా పడుతుంది.  గుండె రక్తాన్ని సరిగా పంపు చేయనప్పుడు, మెదడుకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఇలా మైకం కమ్మినట్టు అయి, స్పృహ కోల్పోయేలా చేస్తుంది. మీకు ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. 


5. చర్మం పాలిపోవడం
గుండె పనితీరును చర్మం కూడా తెలియజేస్తుంది. గుండె తగినంత రక్తాన్ని సరఫరా చేయకపోవడం వల్ల, శరీరానికి రక్త ప్రవాహం తగ్గి, ఎర్రరక్త కణాలలో తగ్గుదలకు దారి తీస్తుంది. దీంతో చర్మం పాలిపోయినట్టు మారుతుంది. అలాంటప్పుడు వైద్యుడిని కలిపి కారణం తెలుసుకోవడం చాలా అవసరం. ఒక్కోసారి రక్తహీనత వల్ల కూడా చర్మం పాలిపోవచ్చు. ఈ రెండింటికీ వైద్య సహాయం అవసరం. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also read: జుట్టు పలుచబడటానికి ఊబకాయం కూడా కారణమే... తేల్చిన పరిశోధన


Also read: ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా... వెల్లుల్లితో తరిమికొట్టండి