గత దశాబ్ధాలుగా ఆహారపదార్థాలను కల్తీ చేసి లాభాలు పొందే వ్యాపారులు ఎక్కువైపోయారు. పాలు, నూనె, కారం, పసుపు... ఇలా రోజువారీ ఆహారంలోని ముఖ్య పదార్థాలలో ఏవేవో కలిపి అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు, ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సంస్థ ట్విట్టర్ లో కల్తీని కనిపెట్టడం ఎలా? అనే అంశంపై కార్యక్రమాలను చేపట్టారు. గత కొన్ని రోజులుగా వివిధ ఆహార పదార్థాలలోని కల్తీని ఎలా కనుక్కోవాలో తెలిపే చిట్కాలను ట్విట్టర్ లో పోస్టు చేస్తున్నారు. తాజాగా కారం కల్తీదో కాదో ఎలా తెలుసుకోవాలో చెబుతూ పోస్ట చేశారు. 


చాలా సింపుల్...
కారం కల్తీదో కాదో తెలుసుకోవడం చాలా సులువు. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ప్రకారం ఒక గ్లాసు నీళ్లలో ఒక టేబుల్ స్పూను కారం వేయాలి. రెండు నిమిషాల పాటూ అలా వదిలేయాలి. పైనున్న నీళ్లను ఒంపేసి, కింద ఉన్న అవక్షేపాన్ని వేళ్లతో నలపాలి. మెత్తగా తగిలితే అది కారమే, అలాకాకుండా గరుగ్గా చిన్నచిన్న రేణువుల్లా అనిపిస్తే మాత్రం అందులో ఇటుక పొడి, సోప్ స్టోన్ పొడి... ఇలా ఎర్రగా ఉన్న పొడులను కలిపినట్టే లెక్క. గతంలో ఇలానే వంట నూనె  కల్తీని ఎలా కనిపెట్టాలో కూడా చెప్పింది ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ సంస్థ.