ఓ గొర్రెల కాపరి, పేరు ఖాలిద్. రోజులానే గొర్రెలను మేపేందుకు కొండ మీదకు వెళ్లాడు. అక్కడ పచ్చిక బయళ్లకు కొదువ లేదు. ఓ చోట చిన్న చెట్టుకు ఎర్రటి పండ్లు కనిపించాయి. గొర్రెలు వాటిని కూడా నమిలి మింగాయి. వాటిని తిన్నాక అవి ఉత్సాహంగా, ఉత్తేజంగా మారడం గమనించాడు ఖాలిద్. తాను కూడా ఆ ఎర్రపండ్లను నమిలి తిన్నాడు. తనలోను ఏదో తెలియని శక్తి పుంజుకున్నట్టు అనిపించింది. వెంటనే ఆ ఎర్రపండ్లను ఏరి ఓ చిన్న మూట కట్టుకుని తమ మత గురువు వద్దకు వెళ్లాడు. కానీ ఆ మత గురువు వాటిని పనికిమాలినవి అంటూ పక్కనున్న మంటలో పడేశాడు. నిప్పులో కాలిన ఆ పండ్లు సువాసనలు వెదజల్లాయి. ఆ వాసనకు అక్కడున్న వారంతా ఫిదా అయిపోయారు. మంటల్లో కాలిన ఆ గింజలను తీసి పొడిలా చేసి వేడినీటిలో వేసుకుని తాగారు ఖాలిద్, మతగురువు. అదే తొలి కాఫీ. ఆ పానీయం వాళ్లకి బాగా నచ్చేసింది. అప్పట్నించి ఖాలిద్ గొర్రెలు మేపడంతో పాటూ, కాఫీ పానీయాన్ని తయారుచేసి అమ్మడం మొదలుపెట్టాడట. కాఫీ పుట్టుక గురించి ‘నేషనల్ కాఫీ అసోసియేషన్’ చెప్పే కథ ఇది. ఇది నిజమేనని చెప్పే ఆధారాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఖాలిద్ ఏ ప్రాంతంలో మొదటిసారి ఆ కాఫీ గింజలను కనిపెట్టాడో చెప్పలేదు కదూ... ఇథియోపియా. అందుకే కాఫీ పుట్టినిల్లుగా ఆ దేశాన్నే చెప్పుకుంటాం. ఇథియోపియా నుంచి ఇతర దేశాలకు ప్రయాణం కట్టిన కాఫీ... ఇప్పుడు 75 దేశాల్లో ప్రధాన వాణిజ్య పంటగా ఉంది.
కాఫీ ప్రియులు పండుగ చేసుకునే రోజు ఇది. ఓ లెక్క ప్రకారం రోజూ ప్రపంచవ్యాప్తంగా 400 బిలియన్ కాఫీ కప్పులు లాగించేస్తున్నారట కాఫీ లవర్స్. వీరందరి కోసం, అలాగే కాఫీ పంటపై ఆధారపడి బతుకుతున్న రైతులు, కాఫీని అమ్ముకుని జీవిస్తున్న కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 1 ‘అంతర్జాతీయ కాఫీ దినోత్సవం’నిర్వహిస్తున్నారు. అమెరికాలోని నేషనల్ కాఫీ అసోసియేషన్ 2014లో ఈ దినోత్సవాన్ని నిర్ణయించింది. అప్పట్నించి ప్రతి ఏడాది అక్టోబర్ 1న కాఫీ దినోత్సవం ప్రపంచవ్యప్తంగా జరుగుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద కాఫీ ఉత్పత్తి దారు బ్రెజిల్. ఏటా దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ గింజల్ని ఉత్పత్తి చేస్తున్నారక్కడ. ఇక మనదేశం కాఫీ అధికంగా పండించే దేశాల జాబితాలో ఏడో స్థానంలో ఉంది.
16వ శతాబ్ధంలో మనకు...
మనదేశానికి కాఫీ గింజలు తొలిసారి చేరింది 16వ శతాబ్ధంలో అని చెబుతోంది కాఫీ బోర్డ్. సూఫీ సన్యాసి బాబా బుడాన్ ఏడు కాఫీ గింజల్ని అరేబియా నుంచి భారతదేశానికి తీసుకువచ్చారని అంటోంది. ఆ గింజల్ని కర్ణాటకలోని చిక్ మంగుళూరులోని తన ఆశ్రమంలో నాటారని తెలిపింది. అక్కడ నుంచే దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా కాఫీ విస్తరించిందని చెబుతోంది. కాఫీని అధికంగా పండించే దేశాల్లో భారత్ కూడా ఒకటి.
కాఫీ తాగితే మంచిదేనా?
1. మోతాదు మించకుండా తాగితే ఏదైనా మంచిదే. అలాగే కాఫీ కూడా. తాజా అధ్యయనం ప్రకారం కాఫీ మితంగా అంటే రోజుకు రెండు కప్పులు మించకుండా తాగితే గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు రావు.
2. కాఫీ తాగడం వల్ల పార్కిన్ సన్స్ వ్యాధి (నరాల సమస్య) ముప్పును తగ్గించుకోవచ్చని మరో పరిశోధన తేల్చింది. అలాగని ఎక్కువ కాఫీ తాగితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
3. కాఫీ తాగిన వెంటనే మెదడు ఉత్తేజమవుతుంది. శరీరమంతా ఉత్సహంగా ఉంటుంది.
4. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని రక్షించడంలో, రొమ్ము క్యాన్సర్ ను నివారించడంలో ముందుంటాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: కోవిడ్ వల్ల మరణించే అవకాశాలు వీరికే ఎక్కువట...
Also read: సర్జరీ సమయంలో ఏడవకండి... దానికి కూడా బిల్లేస్తారు, ఆ దేశంలో ఇదో కొత్త పద్ధతి
Also read: గుండె పంపించే వార్నింగ్ సైన్ లను గమనిస్తున్నారా? నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమే