యువ నటి సౌజన్య ఆత్మహత్య కన్నడ చిత్ర పరిశ్రమను విషాదంలో నింపింది. బెంగళూరులోని కుంబల్‌గోడులోని తన అపార్ట్‌మెంటులో ఆమె శవమై కనిపించింది. కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో ఆమెకు సీని, టీవీ రంగాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. అప్పటి నుంచి ఆమె ఇంటికే పరిమితమైంది. కొడగు జిల్లాలోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి కూడా వెళ్లకుండా బెంగళూరులో ఒంటరిగా గడుపుతోంది. గత కొద్ది రోజులుగా ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదని తెలిసింది. గురువారం ఆమె నివసిస్తున్న అపార్టుమెంటుకు వెళ్లి చూస్తే.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించిందని కుటుంబికులు తెలిపారు. 


ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సౌజన్య రాసిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె గత మూడు రోజులుగా ఆ లేఖను రాస్తున్నట్లు తెలిసింది. అందులో ఆమె పదే పదే తన తల్లిదండ్రులకు క్షమాపణలు తెలియజేసింది. ‘‘ఈ ఆత్మహత్యతో ఎవరికీ సంబంధం లేదు. దీనికి పూర్తి బాధ్యత నాదే. రోజు రోజుకు నాలో నేను కుమిలిపోతున్నాను. నా మానసిక పరిస్థితి కూడా బాగోలేదు. దానికి తోడు అనారోగ్యం లోపల నుంచి చంపేస్తోంది. నన్ను నేను కోల్పోయినట్లు అనిపిస్తోంది. నన్ను నేను ఎప్పుడూ ఇలా చూసుకోలేదు. నేను ఇంటికి వస్తానని చెప్పాను. కానీ, ఇలా వస్తానని మాత్రం అనుకోలేదు. నన్ను క్షమించు అమ్మా. పపా (నాన్న) మీరంటే నాకు చాలా ఇష్టం. ఇలా చేస్తున్నందుకు.. నన్ను క్షమించండి’’ అని ఆ లేఖలో రాసింది. దీన్ని ఆమె ఈ నెల 27న రాసింది. సౌజన్య కన్నడలో పలు సీరియళ్లు, రెండు సినిమాల్లో కూడా నటించింది. అయితే, లాక్‌డౌన్ తర్వాత అవకాశాలు లేకపోవడంతో ఆమె తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందా? అనారోగ్య కారణాల వల్లా? అనేది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: ‘9000 రాత్రులు కలిసి పడుకోవాలి’.. మోస్ట్ రొమాంటిక్ ట్రైలర్ వచ్చేసింది!


ఈ ఏడాది జనవరిలో కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె గతేడాది జులైలోనే ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె ఆ పోస్ట్ డిలీట్ చేసింది. ఆమె కుదుటపడుతుందని అంతా భావిస్తున్న సమయంలో.. ఆత్మహత్య చేసుకుని సినీ పరిశ్రమను విషాదంలో నింపింది. ఆ ఘటన మరిచిపోక ముందే మరో నటి ఆత్మహత్య చేసుకోవడంతో మరింత ఆందోళన నెలకొంది. 


Also Read: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంచు విష్ణు.. ‘మా’లో నామినేషన్ దాఖలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి