ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మున్సిపాలిటీ సమావేశం వాడివేడిగా సాగింది. అధికార పార్టీ కౌన్సిలర్లే సమావేశాన్ని అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. మంత్రికి చెడ్డపేరు తెస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
అక్రమ లే అవుట్లపై చర్చ..
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయని, మున్సిపాలిటీకి రావాల్సిన పన్నులు చెల్లించకుండా లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారని కొంతమంది కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమ లే అవుట్లు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొంతమంది ఒత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో అభాసుపాలు కాకూడదనే ఉద్దేశంతోనే తాము ఈ సమస్యలను లేవనెత్తుతున్నామని చెప్పారు.
ఆత్మకూరు మున్సిపాలిటీలో లుకలుకలు..
ఆత్మకూరు మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ల మధ్యే ఇటీవల కాస్త లుకలుకలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ గ్రూప్‌నకు అధికారులు ఒత్తాసు పలుకుతున్నారు. వారు జట్టు కట్టి మున్సిపాలిటీలో పెత్తనాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో అక్రమ లే అవుట్లకు ఈజీగా అనుమతులు వచ్చేస్తున్నాయి. వాటిల్లో అక్రమంగా గ్రావెల్ తరలింపునకు కూడా అనుమతులు ఆటోమేటిక్‌గా వచ్చేస్తున్నాయనేది వైరి వర్గం ఆరోపణగా ఉంది. అంతే కాదు.. మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలపై చర్చ జరపాలని కొంతమంది కౌన్సిలర్లు పట్టుబట్టారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటే అధికారులు పట్టించుకపోవడం పట్ల సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండానే తమ వార్డులలో పనుల గురించి ప్రకటించడం విడ్డూరంగా ఉందని అధికారులను నిలదీశారు. అక్రమ లేవుట్లకు అక్రమంగా గ్రావెల్ తరలిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు.
అడ్డుకునేదీ వారే.. అనుమతులు ఇచ్చేదీ వారే..
మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే అధికారుల అడ్డుకుని తిరిగి వారే అనుమతులు ఇవ్వడం విడ్డూరంగా ఉందని పలువురు కౌన్సిలర్లు వాపోయారు. డ్రైనేజీ, వీధి లైట్లు, తాగునీటి అవసరాలు, చేతి పంపుల మరమ్మతులు వంటి చిన్నపాటి సమస్యలు పరిష్కరించాలని అడిగినా నిధులు లేవంటూ అధికారులు ముఖం చాటేస్తున్నారని అధికార పార్టీ కౌన్సిలర్లు చెబుతున్నారు. అయితే అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, మంత్రికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
Also Read: ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై నాన్‌బెయిల్‌బుల్ వారెంట్