బద్వేలు ఉప ఎన్నికపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెసీలు, పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. 2019లో దాదాపు 44 వేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్‌ అన్నారు. గత ఎన్నికల్లో దివంగత దాసరి వెంకసుబ్బయ్యకు వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ డాక్టర్‌ సుధకి రావాలని సీఎం అన్నారు. అతి విశ్వాసానికి పోకుండా, ప్రజల ఆమోదాన్ని పొందాలన్నారు. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగిందన్న సీఎం.. ఈ సారి ఓటింగ్‌ శాతం పెరగాలని సూచించారు. అందరూ ఓటు హక్కు వినియోగించకునేలా ఓటర్లను ప్రోత్సహించాలన్నారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలన్న సీఎం జగన్... మండలాన్ని ఒక బాధ్యుడికి అప్పగించాలని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలన్నారు. 




Also Read: బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..


పార్టీ ఇంఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి


గ్రామాల్లో విసృతంగా పర్యటించి ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లాలని సీఎం జగన్‌ అన్నారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చైతన్యపరచాలని నేతలకు సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. నెల రోజుల పాటు నాయకులందరూ ఎన్నికపై దృష్టిపెట్టాలన్నారు. బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని సీఎం జగన్ అన్నారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో వివరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్దేశించారు.




Also Read: బద్వేల్‌ గురించి మర్చిపోయిన రాజకీయ పార్టీలు.. ఉపఎన్నిక ఉంటుందా.. లేక ఏకగ్రీవమేనా..


వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ


ఈ సమావేశంలో మంత్రులు అంజాద్‌ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కురసాల కన్నబాబు, కొడాలి నాని, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొ్న్నారు. బద్వేలు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ నెల 8వ తేదీ నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. అక్టోబర్‌ 30న పోలింగ్‌, నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2019 జనరల్ ఎలక్షన్ లో వైసీపీ తరపున గెలుపొందిన బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28న మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి దాసరి సుధను వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.


Also Read: మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి