సోషల్‌ కామర్స్‌ అంకురం 'మీషో' అదరగొట్టింది. తాజాగా ఫిడిలిటీ, బి క్యాపిటల్‌ సంస్థల నుంచి 570 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రావడంతో సంస్థ విలువ ఏకంగా 500 కోట్ల డాలర్లకు చేరుకుంది. అతి తక్కువ సమయంలోనే అతిపెద్దగా ఎదిగిన భారత స్టార్టప్‌గా రికార్డు సృష్టించింది.


కొత్తగా పెట్టుబడులు
సెప్టెంబర్‌ 30న సిరీస్‌ ఎఫ్‌ రౌండ్లో ఫిడిలిటీ మేనేజ్‌మెంట్‌, బీ క్యాపిటల్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. దాంతో ఐదు నెలల కాలంలోనే మీషో విలువ 500 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇప్పటికే ప్రోసస్‌ వెంచర్స్‌, సాఫ్ట్‌బ్యాంక్, ఫేస్‌బుక్ ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టాయి. ఫుట్‌పాత్‌ వెంచర్స్‌, ట్రైఫెక్టా క్యాపిటల్‌, గుడ్‌ క్యాపిటల్స్‌ సైతం వాటాదారులుగా ఉన్నాయి. అయితే రెండో సిరీసులో పెట్టుబడి సేకరణకు దిగినప్పటికీ ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించేందుకు ఇష్టపడలేదు.


Also Read: ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ టాప్‌.. విక్రయాల్లో 300 శాతం వృద్ధి.. ఎందుకో తెలుసా?


మూడు విభాగాలుగా..
'మీషో'..  సప్లయర్స్‌, రీసెల్లర్స్‌, కస్టమర్స్‌ అనే విభాగాలుగా నడుస్తోంది. ఇందులో నమోదైన రీసెలర్లు సరఫరా దారుల నుంచి అన్‌ బ్రాండెడ్‌ ఫ్యాషన్‌, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటికి బ్రాండింగ్‌ ఇచ్చి వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా విక్రయిస్తారు. సోషల్‌ మీడియా ద్వారానే కాకుండా నేరుగానూ మీషో భారీగా విక్రయాలు చేపట్టి ఫేస్‌బుక్‌, అమెజాన్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలకు పోటీగా మారింది. క్రీడలు, క్రీడా సామగ్రి, ఫిట్‌నెస్‌, పెట్‌ సప్లైయిస్‌, ఆటోమోటివ్‌ పరికారాలనూ మీషో విక్రయిస్తుండటం గమనార్హం.


Also Read: మళ్లీ తగ్గిన పసిడి ధరలు..దీపావళికి రూ.60 వేలకు చేరొచ్చన్న మార్కెట్ నిపుణులు, వెండిదీ అదే దారి


వేగంగా ఎదుగుదల
'మార్కెట్లో మేం చాలా వేగంగా ఎదిగాం. మా వ్యాపారం సైతం వేగంగా అభివృద్ధి చెందింది. ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడులకు మార్కెట్‌ వాతావరణం సైతం అనుకూలంగా ఉంది' అని మీషో సహ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్‌ ఆత్రేయ్‌ తెలిపారు. 'చిన్న వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడమే మా ధ్యేయం. అయితే చాలామంది నేరుగా వచ్చి మా వద్ద కొనుగోలు చేస్తున్నారు. అందుకే మేం వినియోగదారులు, వ్యాపారుల మార్కెట్‌ ప్లేస్‌ పద్ధతులను ఎంచుకొని ముందుకు సాగుతున్నాం. కొత్త ఉత్పత్తులనూ పరిచయం చేస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు.


Also Read: జోరు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఒక్క నెల్లోనే 4లక్షల క్రెడిట్‌ కార్డుల జారీ! ఎందుకీ వేగం?


ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌కు పోటీ
ఈ-కామర్స్‌ సంస్థలకు పోటీగా సోషల్‌ కామర్స్‌ ఎదుగుతోంది. దాంతో 2022 డిసెంబర్‌ నాటికి నెలకు వంద మిలియన్ల లావాదేవీలు చేసే వినియోగదారులను సంపాదించుకోవాలని భావిస్తోంది. టెక్నాలజీ, ప్రొడక్ట్‌ టాలెంట్‌ తదితర విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. 2021, సెప్టెంబర్‌ 27 నాటికే మీషో భారత్‌లో అతిపెద్ద సోషల్‌ కామర్స్‌ వేదికగా ఆవిర్భవించింది. 1.3 కోట్ల రీసెల్లర్స్‌, 4.5 కోట్ల వినియోగదారులు, లక్షకు పైగా సరఫరా దారులు ఉన్నారు. వృద్ధి ఎక్కువగా ఉండటంతోనే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి సంస్థలూ సోషల్‌ కామర్స్‌లోకి వరుస కడుతున్నాయి.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి