ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది చెన్నై సూపర్‌కింగ్స్. అట్టడుగున ఉంది సన్‌రైజర్స్ హైదరాబాద్. గురువారం షార్జా వేదికగా ఇవి తలపడుతున్నాయి. ఈ రెండు జట్ల పోటీల్లో ఎవరు గెలిచినా? ఎవరు ఓడినా? ఎవరికీ ఇబ్బంది లేదు! ఎందుకంటే ధోనీసేన ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకొని నిశ్చింతంగా ఉండగా విలియమ్సన్ సేన పరువు కోసం మాత్రమే ఆడుతోంది.
Also Read: ఈ దీపావళికి బీసీసీఐకి కాసుల పంట! కొత్త జట్లు, మీడియా హక్కుల వేలంతో వేల కోట్ల ఆదాయం
ధోనీ సేనదే పైచేయి
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌దే తిరుగులేని ఆధిపత్యం. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 15 సార్లు తలపడితే 11 సార్లు ధోనీసేనదే విక్టరీ. చివరి ఐదు మ్యాచుల్లోనూ చెన్నై మూడు సార్లు గెలిచింది. ఈ సీజన్లో తలపడ్డ మ్యాచులో ధోనీసేన మరో తొమ్మిది బంతులు మిగిలుండగానే ఏడు వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. హైదరాబాద్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేసింది. మొదట డేవిడ్ వార్నర్ (57), మనీశ్ పాండే (61) అర్ధశతకాలు చేశారు. ఛేదనలో చెన్నై యువ కెరటం రుతురాజ్ గైక్వాడ్ (75; 44 బంతుల్లో), డుప్లెసిస్ (56; 38 బంతుల్లో) చెలరేగారు.
Also Read: ఎట్టకేలకు లైన్‌లోకి వచ్చిన ముంబై.. పంజాబ్‌పై ఆరు వికెట్లతో విజయం
ఫేవరెట్ చెన్నై
ఆటగాళ్ల ఫామ్ ప్రకారం చూసుకుంటే చెన్నై ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. రుతురాజ్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. 40.22 సగటు, 137 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. ఓపెనింగ్‌లో అతడికి అత్యంత అనుభవం ఉన్న డుప్లెసిస్ అండగా ఉంటున్నాడు. రుతురాజ్ ఇబ్బంది పడుతున్నప్పుడు అతడు జోరు పెంచుతున్నాడు. మిడిలార్డరే ధోనీసేనకు కాస్త సమస్యగా మారింది! అంబటి రాయుడు నిలకడగా ఆడితే తిరుగుండదు. రైనా, ధోనీ ఇబ్బంది పడుతున్నారు. జడేజా సిక్సర్లు కొడుతూ విజయాలు అందిస్తుండటం కలిసొచ్చే అంశం. అవసరమైతే శార్దూల్, దీపక్ చాహర్ బ్యాటింగ్ చేయగలరు. బౌలింగ్ పరంగానూ చెన్నైకి సమస్యలేమీ లేవు! మైదానం, పరిస్థితులు, వాతావరణం, ప్రత్యర్థిని బట్టి మైదానంలో ధోనీ అప్పటికప్పుడు వ్యూహాలు అమలు చేయగలడు. అతడున్నంత వరకు చెన్నై బౌలర్లు ఒత్తిడికి లోనవ్వరు!
Also Read: దిల్లీకి కోల్‌కతా చెక్..! 3 వికెట్ల తేడాతో విజయం.. ప్లేఆఫ్స్ వైపు పరుగులు!
అన్నింటా విఫలం!
ఈ సీజన్లో హైదరాబాద్ పేవల ప్రదర్శన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది! పది మ్యాచులో గెలిచింది కేవలం రెండే. ఆ రెండో విజయమూ ఐదు మ్యాచుల తర్వాత అందింది. ఆటగాళ్ల ఫామ్ పక్కన పెడితే వ్యూహాలు, జట్టు ఎంపిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. బాహుబలిగా పేరుపొందిన డేవిడ్ వార్నర్ ఫామ్‌లో లేడు. అతడికి చోటూ ఇవ్వడం లేదు. మిడిలార్డర్‌లో ఒక్కరంటే ఒక్కరైనా ఆడటం లేదు. జేసన్ రాయ్‌ను ఎప్పుడో తీసుకోవాల్సింది. అతడిని కొనసాగిస్తే పరుగులు చేయగలడు. చెన్నైతో చివరి మ్యాచులో మనీశ్ పాండే దుమ్మురేపాడు. మరోసారి అలాంటి ప్రదర్శన చేస్తే బాగుంటుంది! అసలు సన్‌రైజర్స్ అంటేనే బౌలింగ్ జట్టు. అలాంటిది బౌలర్లూ ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు. రషీద్ ఖాన్, జేసన్ హోల్డర్ కాస్త ఫర్వాలేదు. సందీప్, భువీ రాణించాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు గనక సరిగ్గా ఆడకపోతే ఈ మ్యాచులోనూ గట్టెక్కడం కష్టం!