యూఏఈలో ఐపీఎల్ ప్రారంభం అయిన 10 రోజులకు ముంబై మొదటి విజయం అందుకుంది. పంజాబ్‌పై ఆరు వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది. యూఏఈలో ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా.. నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించింది. మార్క్రమ్ (42: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు), దీపక్ హుడా  (28: 26 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) మినహా ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది. ముంబై కూడా ఒక దశలో ఛేజింగ్‌లో తడబడినా... సౌరభ్ తివారీ (45: 37 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) యాంకర్ ఇన్నింగ్స్.. హార్దిక్ పాండ్యా(40 నాటౌట్: 30 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), కీరన్ పొలార్డ్‌(15 నాటౌట్: 7 బంతుల్లో, ఒక సిక్సర్, ఒక ఫోర్) విధ్వంసక బ్యాటింగ్‌తో 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ముంబై ఐదో స్థానానికి రాగా, పంజాబ్ ఆరో స్థానానికి వచ్చింది.


పంజాబ్‌ని ఓ పట్టు పట్టిన ముంబై బౌలర్లు
పంజాబ్ ఇన్నింగ్స్ ఎంతో పేలవంగా ప్రారంభం అయింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన మన్‌దీప్ సింగ్ (15: 14 బంతుల్లో, రెండు ఫోర్లు), కేఎల్ రాహుల్ (21: 22 బంతుల్లో, రెండు ఫోర్లు) మొదటి బంతి నుంచే బాగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. ఆరో ఓవర్లో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో మన్‌దీప్ అవుట్ కావడంతో పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టపోయి 38 పరుగులను పంజాబ్ సాధించింది.


వెంటనే ఏడో ఓవర్లో గేల్, కేఎల్ రాహుల్‌లను అవుట్ చేసి పొలార్డ్ పంజాబ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. పుండు మీద కారం చల్లినట్లు తర్వాతి ఓవర్లోనే నికోలస్ పూరన్ కూడా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బుమ్రా వేసిన యార్కర్‌కు తన దగ్గర సమాధానమే లేకపోయింది. దీంతో పంజాబ్ 48 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం మార్క్రమ్ (42: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు), దీపక్ హుడా  (28: 26 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) జట్టును ఆదుకున్నారు. వీరు నిలకడగా ఆడుతూ ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ చాహర్ బౌలింగ్‌లో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత హుడా, హర్‌ప్రీత్ బ్రార్(14:19 బంతుల్లో) భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లలో పొలార్డ్, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు. పంజాబ్ చివరి ఐదు ఓవర్లలో కేవలం 29 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది.


Also Read: రూ.10 లక్షల కోసం ఫిక్సింగ్‌ చేస్తానా? పార్టీలకే రూ.2లక్షలు ఖర్చు చేస్తాను తెలుసా! స్పాట్‌ ఫిక్సింగ్‌పై శ్రీశాంత్‌


ముంబై కూడా మెల్లగానే..
ఇక ముంబై ఇన్నింగ్స్ కూడా అలాగే ప్రారంభం అయింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో కీలక బ్యాట్స్‌‌మెన్ రోహిత్ శర్మ (8: 10 బంతుల్లో, ఒక ఫోర్), సూర్యకుమార్ యాదవ్(0: 1 బంతి)లని వరుస బంతుల్లో అవుట్ చేసి రవి బిష్ణోయ్ ముంబైని ఒక్కసారిగా ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ దశలో క్వింటన్ డికాక్ (27: 29 బంతుల్లో, రెండు ఫోర్లు), సౌరభ్ తివారీ (45: 37 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) కలసి జట్టును ముందుకు నడిపించారు. వీరిద్దరూ కాసేపు నిలకడగా ఆడి మూడో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో డికాక్ క్లీన్ బౌల్డయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు మాత్రమే చేయగలిగింది.


ఆ తర్వాత సౌరభ్ తివారీకి హార్దిక్ పాండ్యా జతకలిశాడు. వీరు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే కీలక సమయంలో తివారీ అవుటవ్వడంతో ముంబై మళ్లీ ఇబ్బందుల్లో పడింది. అయితే హార్దిక్ పాండ్యా, పొలార్డ్ కలిసి మ్యాచ్‌ను గెలిపించారు. ఒక దశలో ఛేదన కష్టం అనిపించినా.. చివరిలో పొలార్డ్, పాండ్యా దూకుడుగా ఆడటంతో విజయం సులభం అయింది. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా, షమి, ఎల్లిస్ చెరో వికెట్ తీశారు.


Also Read: సంజు @ 3000.. ఆ ఘనత అందుకున్న 19వ ఆటగాడిగా రికార్డు


Also Read: సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్ ఆఖరి మ్యాచ్ ఆడేశాడా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కామెంట్‌కు అర్థం ఏంటి?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి