డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడా? జట్టు వైఫల్యానికి తననే బాధ్యుడిని చేశారని మనస్తాపం చెందాడా? ఇక బాహుబలి వార్నర్‌ను ఆరెంజ్ జెర్సీలో చూడలేమా? ఇన్‌స్టాగ్రామ్‌లో వార్నర్ కామెంట్లు చూస్తే ఈ అనుమానాలు నిజం కాబోతున్నాయని అనుకోవచ్చు. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జేసన్ రాయ్‌ని వార్నర్ స్థానంలో తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో కనీసం మైదానంలో కూడా వార్నర్ కనిపించలేదు.


దీనిపై పలువురు అభిమానులు సన్‌రైజర్స్ అధికారిక ఇన్‌స్టాగ్రాం ఖాతాలోని పోస్టులకు కామెంట్లు పెట్టారు. వీటికి వార్నర్ రిప్లై ఇస్తూ.. ఆరెంజ్ జెర్సీలో తాను ఆఖరి మ్యాచ్ ఆడేశానని అర్థం వచ్చేలా కామెంట్లు పెట్టాడు. ఒక అభిమాని ‘Daveyyyy I'm crying take some rest give a power-packed comeback buddy’ అని కామెంట్ పెట్టగా.. వార్నర్ దానికి రిప్లై ఇస్తూ ‘unfortunately won't be again but keep supporting please’ అన్నాడు.


‘కాస్త విశ్రాంతి తీసుకుని తిరిగి పవర్ ఫుల్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వు’ అని అభిమాని పెట్టిన కామెంట్‌కు ‘దురదృష్టవశాత్తూ మళ్లీ జరగదు.. కానీ సపోర్ట్ చేస్తూనే ఉండండి’ అని వార్నర్ పెట్టిన రిప్లైకి అర్థం. ఈ కామెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. డేవిడ్ వార్నర్‌ను వచ్చే సీజన్‌కు రిటైన్ చేయకపోతే.. సన్‌రైజర్స్‌కు అస్సలు మద్దతివ్వబోమని పలువురు అభిమానులు ఆవేశంగా పోస్టులు పెడుతున్నారు.






ప్రస్తుత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఘోరమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో `మొదటి ఏడు మ్యాచ్‌లకు వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఆ ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవడంతో వార్నర్‌ను జట్టులో నుంచి తీసేసి.. కేన్ విలియమ్సన్‌కు కెప్టెన్సీ అందించారు. వార్నర్ స్థానంలో రాయ్‌ని జట్టులోకి తీసుకున్నారు.


అయితే రెండో అంచెలో బెయిర్‌స్టో గాయపడటంతో వార్నర్, సాహాలను ఓపెనింగ్‌కు పంపించారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో వార్నర్ (0,2) ఘోరంగా విఫలం కావడంతో అతని స్థానంలో జేసన్ రాయ్ జట్టులోకి వచ్చాడు. జేసన్ రాయ్ మొదటి మ్యాచ్‌లోనే మెరుపులు మెరిపించడంతో ఇక వార్నర్‌కు అవకాశం లేదనే అనుకోవాలి. అలాగే ఈ మ్యాచ్‌లో కనీసం గ్రౌండ్‌లో కూడా వార్నర్ కనిపించలేదు.


Also Read: షాకిచ్చిన మొయిన్‌ అలీ! టెస్టులకు గుడ్‌బై.. మూడో బెస్ట్‌ బౌలర్‌ అతడే!


కప్ కొట్టిందంటే వార్నర్ వల్లే..


వార్నర్‌ని ఇంత అవమానకరమైన రీతిలో వెనక్కిపంపడంపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. 2014 నుంచి వార్నర్.. సన్‌రైజర్స్‌కు ఆడుతున్నాడు. ఆ సీజన్లో 528 పరుగులు చేసిన వార్నర్, 2015 సీజన్‌లో 562 పరుగులు, 2016 సీజన్‌లో ఏకంగా 848 పరుగులు(సన్‌రైజర్స్ ఐపీఎల్ గెలిచిన ఏకైక సీజన్ ఇదే), 2017లో 641 పరుగులు, 2019లో 692 పరుగులు, 2020లో 548 పరుగులు చేశాడు. 2015, 2017, 2019లో ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలుచుకోవడం వార్నర్ ఎంత నిలకడతో ఆడుతున్నాడనే దానికి నిదర్శనం.


ఇక ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 195 పరుగులు చేసి విఫలం అయ్యాడు. ఈ సమయంలో కేన్ విలియమ్సన్ కూడా గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. 8 మ్యాచ్‌ల్లో తన స్కోరు 198 పరుగులు మాత్రమే. మరి ఏ ప్రాతిపదికన వార్నర్‌ను జట్టు నుంచి తొలగించారనే విషయం తెలియరాలేదు.


ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లు చెన్నై, ముంబైల విజయ రహస్యం ఆటగాళ్లకు భరోసాను ఇవ్వడమేనని ఇక్కడ గుర్తుంచుకోవాలి. 2020 సీజన్‌లో దారుణంగా విఫలం అయినప్పటికీ.. చెన్నై మేనేజ్‌మెంట్ ధోనికి పూర్తిగా సపోర్ట్‌ను ఇచ్చింది. అలాగే ముంబై కూడా జట్టు ప్రదర్శన సరిగ్గా లేనప్పుడు ఆటగాళ్లను పక్కన పెట్టకుండా వారికి భరోసాను ఇస్తారు. ఒక బుమ్రా, ఒక హార్దిక్, ఒక రుతురాజ్, ఒక జడేజా తయారయ్యారంటే.. దానికి వారి టాలెంట్‌తో పాటు జట్టు మేనేజ్‌మెంట్ నుంచి వచ్చిన సపోర్ట్ కూడా కారణం.


సన్‌రైజర్స్ జట్టు కోసం ఎంతో కష్టపడి.. వారికి ఒక కప్‌ను కూడా అందించిన వార్నర్‌ను యాజమాన్యం ఇలా పక్కన పెట్టడం అనే క్రికెట్ అభిమానులను ఎంతో బాధించే అంశం. ఒకవేళ మెగా ఆక్షన్‌కు ముందు వార్నర్‌ను వేలంలోకి వదిలేస్తే మాత్రం అది రైజర్స్ చేసే చారిత్రక తప్పిదం అవుతుంది. వార్నర్ కోసం మిగతా జట్లు కచ్చితంగా పోటీ పడతాయి. భారతదేశంలో విపరీతమైన అభిమానులు ఉన్న విదేశీ ఆటగాళ్లలో వార్నర్ కచ్చితంగా ముందువరుసలో ఉంటాడు. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ వంటి వారికి భారత అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మరి వార్నర్‌ను రైజర్స్ రిటైన్ చేస్తారా.. ఒకవేళ వేలంలోకి వెళ్తే ఈసారి ఈ బాహుబలిని ఎవరు సొంతం చేసుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి.


Also Read: హర్షల్ పటేల్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించిన ఆర్సీబీ బౌలర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి