ముంబై ఇండియన్స్ తో జరిగిన 39వ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరు 6వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ముంబై ముందు 166 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్ కు దిగిన రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ బ్యాటర్లు తడబాటుకు లోనయ్యారు. ఆర్సీబీ బౌలర్ల బంతులకు ముంబై ఆటగాళ్లు దాసోసమయ్యారు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో పర్పల్ క్యాప్ హోల్డర్ గా ఉన్న ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ మరోసారి అద్భుతం చేశాడు. ఫేజ్ 1లో ముంబై జట్టుపై 5 వికెట్ల ఇన్నింగ్స్ తో చెలరేగిన హర్షల్ పటేల్.. తాజాగా జరిగిన మ్యాచ్‌లో మరోసారి విశ్వరూపాన్ని చూపాడు. హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్. గతంలో ప్రవీణ్ కుమార్, శామ్యూల్ బద్రి ఈ ఫీట్ నమోదు చేశారు. ప్రవీణ్ కుమార్ 2010 ఐపీఎల్‌లో, శామ్యూల్ బద్రి 2017లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు.


Also Read: డుప్లెసిస్ ఫీల్డింగ్ అద్భుతం.. మోకాలికి రక్తం కారుతున్నా క్యాచ్ మాత్రం వదల్లేదు.. నెటిజన్ల ప్రశంసలు






మూడు వరుస బంతుల్లో హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్, రాహుల్ చహర్ లను పెవిలియన్ బాట పట్టించాడు. 17వ ఓవర్ తొలి బంతికి పాండ్యా షాట్ కొట్టిన బంతిని కోహ్లీ క్యాచ్ అందుకున్నాడు. రెండో బంతికి పోలార్డ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మూడో బంతికి రాహుల్ చహర్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు.  కచ్చితంగా గెలుస్తామనుకున్న ముంబై జట్టుకు ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ షాకిచ్చాడు. చివరికి ముంబై జట్టు 18.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబైపై 54 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ముంబైపై జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ గెలుపొందడం విశేషం.


Also Read: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. టీ20ల్లో తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్ 


ముంబైపై మరోసారి...
హర్షల్ పటేల్ ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో చెలరేగాడు. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆర్సీబీ బౌలర్ 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్‌పై ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గానూ ఇతడి పేరిటే రికార్డు ఉంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల ఇన్నింగ్స్‌తో ముంబైపై ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి