సోయా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మరి, లైంగిక శక్తి, సంతానం కోరుకొనే పురుషులు సోయాను తినొచ్చా? దీనిపై అధ్యయనాలు ఏం చెప్పాయో తెలుసుకుందాం. 


సోయాలో ఆరోగ్యాన్ని అందించే అనేక అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అధిక బరువు, గుండె సమస్యలతో బాధపడేవారు సోయా తినడం మంచిది. సోయా సాధారణ క్యాన్సర్‌ల నుంచి కాపాడుతుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. సోయాను ఏ విధంగానైనా తీసుకోవచ్చు. స్యూతీస్, సలాడ్ లేదా కూరలతో కలిపి తినొచ్చు. సోయాను ‘సోఫా పనీర్’ అని కూడా పిలుస్తారు. అయితే, పురుషులు సోయా తినడం వల్ల లైంగిక, సంతాన సమస్యలు ఎదుర్కొంటారని చాలామంది భావిస్తారు. పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని తెలియజేయడంతో.. ప్రజల్లో ఈ సందేహం నెలకొంది. అయితే, తాజా అధ్యయనాలు మాత్రం అవన్నీ అపోహలేనని పేర్కొంది. ఆ వివరాలు తెలుసుకొనే ముందు గత అధ్యయనాలు సోయాను ఎందుకు తినకూడదని చెప్పాయో చూద్దాం. 


సోయాబీన్‌లను ఐసోఫ్లేవోన్స్ లేదా ఫైటోఈస్ట్రోజెన్‌లుగా పిలిచే ప్రత్యేక తరగతి పాలీఫెనాల్‌‌గా పరిగణిస్తారు. ఇవి ఆడ హార్మోన్ ఈస్ట్రోజెన్‌ని అనుకరిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. పురుషులు లైంగిక పనితీరును తగ్గించే టెస్టోస్టెరాన్ స్థాయిని ఇది తగ్గిస్తాయని పేర్కొన్నాయి. కనుక పురుషులు సోయాను అస్సలు తినకూడదని సూచించాయి. ఫైటోఈస్ట్రోజెన్ పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని స్పష్టం చేశాయి. 


అయితే, తాజా అధ్యయనాలు మాత్రం ఈ విషయాన్ని ఖండించాయి. ఇందుకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశాయి. సోయా ఐసోఫ్లేవోన్స్, ఈస్ట్రోజెన్ అనేవి వేర్వేరుగా పనిచేస్తాయని స్పష్టం చేశాయి. సోయా పురుషులపై చూపే ప్రభావం గురించి తెలుసుకొనేందుకు నిర్వహించిన మొదటి అధ్యయనం.. తగిన ఆధారాలను చూపించడంలో విఫలమైంది. 2008లో నిర్వహించిన అధ్యయనంలో సోయా తినే పురుషులలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని పరిశోధకులు  కనుగొన్నారు. అయితే, అదే బృందం 2015లో నిర్వహించి మరొక అధ్యయనంలో తెలుసుకున్న అంశాలకు తగిన రుజువులను చూపించడంలో విఫలమయ్యారు.  


అయితే 2010లో నిర్వహించిన పరిశోధనల ప్రకారం.. ఐసోఫ్లేవోన్ తీసుకోవడానికి, స్పెర్మ్ క్వాలిటీకి మధ్య ఎటువంటి సంబంధం లేదని స్పష్టమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన అధ్యయనంలో పరిశోధకులు రెండు నెలల పాటు రోజూ 40 మి.గ్రా ఐసోఫ్లేవోన్స్ కలిగిన సప్లిమెంట్‌ని ఆరోగ్యవంతులైన పురుషులకు అందించారు. అనంతరం వారి వీర్యాన్ని పరీక్షించారు. ఈ సందర్భంగా ఐసోఫ్లేవోన్స్ వారి స్పెర్మ్ నాణ్యతపై ఎలాంటి ప్రభావం చూపలేదని రుజువైంది. కాబట్టి పురుషులు సోయా ఉత్పత్తులు తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. 


సోయా బీన్ వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు: 
⦿ సోయా బీన్‌లోని ప్రోటీన్స్ పిల్లలు, పెద్దలకు మేలు చేస్తాయి. పాలలో లభించే ప్రోటీన్లన్నీ సోయాలో లభిస్తాయి. 
⦿ మాంసంతో సమానంగా సోయాలో ప్రోటీన్లు లభిస్తాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పష్టం చేసింది. 
⦿ మొక్కల నుంచి లభించే ఆహారంతో పోల్చినా సోయాలోనే ఎక్కువ ప్రొటీన్లు ఉన్నాయట. 
⦿ ప్రోటీన్లతోపాటు శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు కూడా సోయాలో ఎక్కువగా ఉంటాయి. 
⦿ సోయాలో ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 
⦿ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. క్యాన్సర్ ముప్పు కూడా ఉండదు.
⦿ సోయాలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సహకరిస్తుంది. 
⦿ సోయాలో ఐరన్ శాతం కూడా ఎక్కువే. కాబట్టి.. రక్తహీనతతో బాధపడేవారు సోయా తీసుకోవడం బెటర్. 
⦿ ప్రోసెసింగ్ చేయని సోయాలో కాల్షియం శాతం ఎక్కువ. 
⦿ సోయాను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్-డి కూడా లభిస్తుంది.


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు! 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీ డైట్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. 


Also Read: ఎడమవైపు తిరిగి ఎందుకు పడుకోవాలి? అసలు ఎటు తిరిగి పడుకుంటే మంచిది?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి