దిల్లీ క్యాపిటల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. మరో పది బంతులు మిగిలుండగానే 3 వికెట్ల తేడాతో గెలుపు తలుపు తట్టింది. శుభ్‌మన్‌ గిల్‌ (30; 33 బంతుల్లో 1x4, 2x6) ఔటవ్వడంతో కాస్త ఉత్కంఠ రేగినా.. సునిల్‌ నరైన్‌ (21; 10 బంతుల్లో 1x4, 2x6), నితీశ్‌ రాణా (36*; 27 బంతుల్లో 2x4, 2x6) కథ ముగించారు. అంతకు ముందు దిల్లీలో స్టీవ్‌స్మిత్‌ (39; 34 బంతుల్లో 4x4), రిషభ్ పంత్‌ (39; 36 బంతుల్లో 3x4), శిఖర్‌ ధావన్‌ (24; 20 బంతుల్లో 5x4) ఫర్వాలేదనిపించారు.


Also Read: సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్ ఆఖరి మ్యాచ్ ఆడేశాడా.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కామెంట్‌కు అర్థం ఏంటి?


నరైన్‌ సిక్సర్లతో..
స్వల్ప లక్ష్యమైనా పిచ్ మందకొడిగా ఉండటంతో కోల్‌కతా ఛేదనపై ఉత్కంఠ కలిగింది. అందుకు తగ్గట్టే వారి ఆటతీరూ ఉంది. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ దూకుడుగానే ఆడారు. అయితే దిల్లీ బౌలర్లు పుంజుకోవడంతో 28 వద్ద వెంకటేశ్‌ అయ్యర్‌ (14), 43 వద్ద రాహుల్‌ త్రిపాఠి (9), 67 వద్ద గిల్‌, మోర్గాన్‌ (0) పెవిలియన్‌ చేరుకున్నారు. నితీశ్‌ రాణా మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. అతడికి దినేశ్‌ కార్తీక్‌ (12) కాసేపు తోడుగా ఉన్నాడు. కీలక సమయంలో డీకేను అవేశ్‌ ఔట్‌ చేయడంతో ఉత్కంఠ రేగింది. అయితే రబాడ వేసిన 16వ ఓవర్లో నరైన్‌ వరుసగా 6, 4, 6 బాదేయడంతో 21 పరుగులు వచ్చాయి. 18 బంతుల్లో 6 పరుగులు అవసరమైన వేళ నరైన్‌, సౌథీ ఔటైనా.. రాణా అజేయంగా నిలిచి లాంఛనం పూర్తి చేశాడు. అవేశ్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీశాడు.


Also Read: రూ.10 లక్షల కోసం ఫిక్సింగ్‌ చేస్తానా? పార్టీలకే రూ.2లక్షలు ఖర్చు చేస్తాను తెలుసా! స్పాట్‌ ఫిక్సింగ్‌పై శ్రీశాంత్‌


మిస్టరీ స్పిన్నర్ల ధాటికి..
మొదట బ్యాటింగ్‌ చేసిన దిల్లీకి శుభారంభమే దక్కింది. మందకొడి పిచ్‌పై ధావన్ మంచి షాట్లు ఆడాడు. జట్టు స్కోరు 35 వద్ద అతడిని ఫెర్గూసన్‌ ఔట్‌ చేశాడు. మరో ఐదు పరుగులకే శ్రేయస్‌ అయ్యర్ (1)ను సునిల్‌ నరైన్‌ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో రిషభ్‌ పంత్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రెండో అంచెలో తొలి మ్యాచ్‌ ఆడిన స్టీవ్‌స్మిత్‌ కొన్ని మెరుగైన షాట్లు ఆడినా అతడినీ ఫెర్గూసనే పెవిలియన్‌ చేర్చాడు. హెట్‌మైయిర్‌ (4) సైతం ఎక్కువ సేపు ఉండలేదు. మిస్టరీ స్పిన్నర్లు నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి ధాటికి దిల్లీ విలవిల్లాడింది. పంత్‌ మినహా ఆ తర్వాత వచ్చిన లలిత్‌ యాదవ్‌ (0), అక్షర్‌ పటేల్‌ (0), అశ్విన్‌ (9), రబాడా (0*),  అవేశ్‌ ఖాన్‌ (5) విఫలమవ్వడంతో దిల్లీ 127/9కి పరిమితమైంది. ఫెర్గూసన్, నరైన్‌, వెంకటేశ్‌ అయ్యర్ తలో రెండు వికెట్లు తీశారు. చక్రవర్తి వికెట్లు తీయకున్నా పరుగులను నియంత్రించాడు.


Also Read: సంజు @ 3000.. ఆ ఘనత అందుకున్న 19వ ఆటగాడిగా రికార్డు