ఒక పక్క ధరలు పెరుగుతున్నా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాలు ఇళ్ల విక్రయాల్లో 113 శాతం వార్షిక వృద్ధి సాధించాయి. 2020 మూడో త్రైమాసికంలో 29,520 యూనిట్లు (ఇళ్లు) అమ్ముడవ్వగా 2021 మూడో త్రైమాసికంలో అనూహ్యంగా 62,800 యూనిట్లు అమ్ముడయ్యాయని అనరాక్‌ నివేదిక తెలిపింది. అత్యధికంగా ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో 33 శాతం, ఆ తర్వాత దిల్లీలో 16 శాతం విక్రయాలు నమోదయ్యాయని పేర్కొంది.


Also Read: జోరు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ.. ఒక్క నెల్లోనే 4లక్షల క్రెడిట్‌ కార్డుల జారీ! ఎందుకీ వేగం?


పెరిగిన ఇన్‌పుట్‌ కాస్ట్‌
2020 మూడో త్రైమాసికంతో పోలిస్తే 2021 మూడో త్రైమాసికంలో ప్రాపర్టీ ధరలు 3 శాతం వార్షికంగా సగటుతో పెరిగాయి. ముడి వనరుల ధరలు పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. టాప్‌-7 నగరాల్లో ఇన్‌పుట్‌ కాస్ట్‌ 2020 మూడో త్రైమాసికంలో చదరపు అడుగుకు రూ.5600 ఉండగా 2021 మూడో త్రైమాసికంలో రూ.5,760కి పెరిగింది. బెంగళూరు నగరంలో గతేడాదితో పోలిస్తే ఏకంగా నాలుగు శాతం ధర పెరిగింది.


Also Read: చీకట్లో చైనా.. పరిశ్రమలకు చిక్కులు.. ఇక ప్రపంచానికి చుక్కలు!


కొత్త యూనిట్లు
ఈ ఏడు నగరాల్లో గతేడాది మూడో త్రైమాసికంలో 32,530 కొత్త యూనిట్లు మొదలవ్వగా ఈసారి 98 శాతం వృద్ధితో 64,560కి పెరిగాయని నివేదిక వెల్లడించింది. ముంబయి మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో దాదాపుగా 16,510 కొత్త యూనిట్లు ప్రారంభం కాగా హైదరాబాద్‌ 14,690 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది.


మధ్య (రూ.40-80 లక్షలు), ప్రీమియం (రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్లు) ఇళ్ల సెగ్మెంట్లో సరఫరా వరుసగా 41 శాతం, 25 శాతం పెరిగింది. అందుబాటు ధరల్లో ఇళ్ల (రూ.40 లక్షల కన్నా తక్కువ) గత త్రైమాసికంతో పోలిస్తే 24 శాతం తగ్గింది.


Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.4 వేలకు పైగా తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్!


విక్రయాల్లో హైదరాబాద్‌ టాప్‌
* హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో 2021 మూడో త్రైమాసికంలో దాదాపుగా 6,735 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా 300 శాతం పెరగడం ప్రత్యేకం. గత నాలుగైదు క్వార్టర్లలో సరఫరా పెరగడమే ఇందుకు కారణం.


* ముంబయి, పుణెలోనూ ఇళ్ల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధే నమోదైంది. ముంబయిలో 128 శాతం (దాదాపుగా 20,965 యూనిట్లు), పుణెలో 100 శాతం (దాదాపుగా 9,705 యూనిట్లు) వృద్ధి నమోదైంది.  ఇక దిల్లీలో 97 శాతం, బెంగళూరులో 58 శాతం, చెన్నైలో 113 శాతం, కోల్‌కతా 99 శాతం వృద్ధి నమోదైంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 


ఉద్యోగ భద్రత పెరగడంతో డిమాండ్‌
'ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగం వృద్ధి చెందడంతో దేశవ్యాప్తంగా టాప్‌-7 నగరాల్లో ఇళ్ల కొనుగోలుకు డిమాండ్‌ పెరిగింది. ఉద్యోగ భద్రత పెరగడం, ఐటీ, ఐటీఈఎస్‌, ఆర్థిక రంగంలో ఉపాధి పెరగడం, తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు లభించడం సొంత ఇళ్లు ఉండాలన్న సెంటిమెంట్‌ను పెంచింది. వ్యాక్సినేషన్‌ పెరగడంతో ఆర్థిక వ్యవస్థ తిరిగి జవసత్వాలను అందుకుంటోంది. అందుకే నగరాల్లో సొంత ఇంటికి డిమాండ్ పెరిగింది' అని అనరాక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పూరి తెలిపారు.