చైనా.. ప్రపంచలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. పరిశ్రమలు, ఉత్పాదక రంగంలో చైనాకు తిరుగు లేదు. అలాంటి డ్రాగన్.. ఇప్పుడు అంధకారంలోకి జారిపోతుంది. అక్కడి ఇళ్లు, పరిశ్రమలు తీవ్రమైన కరెంటు కోతలను ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావం ప్రపంచంపై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉంది. పరిస్థితి ఇంత దిగజారడానికి కారణమేంటి?


అంధకారంలో..


ఈశాన్య చైనాలో కరెంటు కొరత ప్రభావం అక్కడి ఇళ్లు, పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇళ్లు చీకట్లో మగ్గిపోతుండగా, కరెంటు లేక పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దుకాణదారులు.. కొవ్వొత్తుల వెలుగులో వ్యాపారం చేసుకుంటున్నారు. వీరంతా సోషల్ మీడియా వేదికగా కరెంటు సరఫరాను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


గత వారం నుంచి కరెంటు కోతలు మరింత ఎక్కువగా ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు.  చాంగ్‌చున్ వంటి నగరాల్లో కూడా కరెంటు కోతలు తరచుగా ఉంటున్నాయని స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. 


కారణమేంటి?


బొగ్గు సరఫరా తగ్గడంతో చైనాలో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. దీంతో విద్యుత్ కొరత పెరుగుతోంది. ఇది ఇలానే కొనసాగితే పరిశ్రమలు షట్‌డౌన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. పెరుగుతున్న కరెంట్ కొరత ప్రపంచవ్యాప్తంగా చైయిన్ సిస్టమ్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని పారిశ్రామిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.


యాపిల్, టెస్లా వంటి దిగ్గజ కంపెనీలకు కూడా ఉత్పత్తుల సరఫరా నిలిచిపోతుందని భయపడుతున్నారు. టెక్, ఫార్మా, ఆటో సెక్టార్లపై కూడా దీని ప్రభావం భారీగా పడే అవకాశం ఉంది. 


కరెంటు వినియోగంపై బీజింగ్ విధించిన పరిమితులకు లోబడే తాము వినియోగిస్తున్నామని ఈశాన్య చైనాలో పరిశ్రమలు చెబుతున్నాయి. అయితే ఆర్థికవేత్తలు, పర్యావరణవేత్తల మాటలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పరిశ్రమలు ఇప్పటికే ఈ ఏడాదికి కేటాయించిన కరెంటు కోటాను వినియోగించేశాయని వారు అంటున్నారు. కరోనా తర్వాత ఎగుమతుల డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు.


లియోయాంగ్ నగరంలో విద్యుత్ అంతరాయం వల్ల వెంటిలేటర్ మూతపడటం వల్ల ఓ మెటల్ క్యాస్టింగ్ ఫ్యాక్టరీలో ప్రమాదకర గ్యాస్ లీకైంది. దీని వల్ల 23 మంద ఆసుపత్రి పాలైనట్లు సీసీటీవీ పేర్కొంది.


దిగ్గజ కంపెనీలు విలవిల..


విద్యుత్ కోతల వల్ల పలు దిగ్గజ కంపెనీలు కూడా ఉత్పత్తిని నిలిపివేశాయి. క్రిస్మస్ దగ్గర పడుతోన్న వేళ ఇలాంటి పరిణామాలు స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్స్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.


ఈ పరిణామాలపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ స్పందించారు. చైనాలో పెరుగుతున్న కరెంట్ కొరత ప్రపంచవ్యాప్తంగా చైన్ సిస్టమ్‌ను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. 


కరెంటు ఎక్కువగా తీసుకునే వాటర్ హీటర్స్, మైక్రోవేవ్ ఒవెన్స్‌ను వినియోగించరాదని హులుదావో నగరవాసులను అధికారులు ఆదేశించారు. షాపింగ్ మాల్స్‌ను కూడా త్వరగా మూసివేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.


ఆర్థిక వ్యవస్థపై ప్రభావం..


కరోనా తర్వాత ప్రపంచ మార్కెట్లు ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో చైనా కారణంగా మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ షేక్ అవుతాయనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీనికి కారణం చైనాలో రెండో దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్‌గ్రాండే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ ప్రభావం ఇప్పటికే ఇప్పటికే చైనీస్, హాంకాంగ్ మార్కెట్లపై పడింది.


ఇప్పుడు మళ్లీ విద్యుత్ కొరత వల్ల చైనా పరిశ్రమలు అంధకారంలోకి జారిపోబోతున్నాయి. ఈ ప్రభావం ప్రపంచంపై కచ్చితంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.


Also Read:Swiggy and Zomato: స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్... మా వాష్ రూమ్స్ వాడొద్దు... రెస్టారెంట్ యాజమాన్యంపై నెటిజన్ల ఆగ్రహం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి