"రాబోయేది జనసేన రాజ్యమే" నని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిడికిలి బిగించి ప్రకటించారు. ఆయనలో ఎంతో కాన్ఫిడెన్స్ కనిపించింది. ఈ సారి తోట్రుపాటు లేదు. తనది రాజకీయంగా గందరగోళ విధానం అన్నవారికి సూటిగానే సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకూ సమాజ సేవ తరహాలో ఆలోచించినా ఇక నుంచి రాజకీయమే చేస్తానని ప్రకటించారు. దీంతో పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల కోసం ఓ స్పష్టమైన విజన్‌తోనే రెడీ అయ్యారని ... ఆ విజన్ ఒంటరి పోరాటమేనన్న అభిప్రాయం జనసైనికుల్లో కూడా గట్టిగా వినిపిస్తోంది. 


ప్రభుత్వం మారుతుంది..జనసేన అధికారంలోకి వస్తుందని పవన్ ధీమా ! 


మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పవన్ కల్యాణ్‌ ప్రసంగంలో చాలా స్పష్టమైన మార్పు కనిపించింది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తరవాత వచ్చిన నీరసం అంతా పోయేలా.. పార్టీ కార్యకర్తలకు.. నేతలకు మళ్లీ ఆశలు చిగురించేలా.. నూతన ఉత్సాహంతో క్యాడర్ పరుగులు పెట్టేలా ఆయన ప్రసంగం ఉంది. గతంలో ఆయన ప్రసంగంలో ఓ అస్పష్టత ఉండేది. గెలవకపోవచ్చు కానీ ఓడిస్తా... అధికారం కోసం రాలేదు.. పాతికేళ్ల రాజకీయం కోసం వచ్చా ఇప్పుడే కుర్చీ ఎక్కాలన్న ఆలోచన లేదు .. అంటూ గందరగోళ ప్రకటనలు చేసేవారు. దీంతో సహజంగానే ఆ పార్టీకి ఓటు వేయాలనుకున్న వారిలో  పవన్ కల్యాణే తనను తాను ప్రత్యామ్నాయంగా చూడటం లేదు. ఇక ఎందుకు ఓటేయాలన్న భావన వచ్చింది. ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించింది. అయితే పవన్ కల్యాణ్ ఈ సారి స్పీచ్‌లో ఎక్కడా డొలాయమానం లేదు. అంతకు మించి స్పష్టత ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతుందని గట్టిగా తేల్చేశారు. ఈ సారి జనసేన చేతికి పగ్గాలు అందబోతున్నాయని నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు.


Also Read : "ఇండస్ట్రీ" పవన్‌ను వద్దనుకుందా ? తమ కోసం పోరాడినా ఒంటరిని చేశారా?


జనసేన బేస్‌ ఓటు బ్యాంక్ కోసం తొలి సారి వ్యూహాత్మక ప్రయత్నం ! 
పవన్ ప్రసంగంలో ఎప్పుడూ లేనంత క్లారిటీ ఇప్పుడు ఉంది. అదే జనసేన భవిష్యత్ గురించిన క్లారిటీ కూడా ఉంది. ఏ రాజకీయ పార్టీకి అయినా ఓటు బ్యాంక్ కీలకం. దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వాటి ఓటు బ్యాంకులే బలం. ఆ ఓటు బ్యాంకులు ఎలా వస్తాయన్నది నేరుగా చెప్పుకోవాలంటే .. కేవలం సామాజికవర్గం ద్వారానే వస్తాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకులు మాత్రం సామాజికవర్గాల బలాల మీదనే ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని తీసుకుంటే టీడీపీకి, వైసీపీకి రెండు ప్రధాన సామాజికవర్గాల మద్దతు ఉంది. పవన్ కల్యాణ్ అందుకే ఆ రెండు వర్గాలకేనే అధికారం అంటూంటారు. కానీ ఆయన ఎప్పుడూ తన పార్టీ మూడో వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పడానికి ధైర్యం చేయలేకపోయారు. ఆ మూడో వర్గం ఆయనను నెత్తిన పెట్టుకునే కాపు సామాజికవర్గం. ఆయన తనపై కుల ముద్ర పడకుండా ఉండాలని పవన్ అనుకున్నారు. అందుకే కాపుల విషయంలో పార్టీ పెట్టినప్పటి నుండి కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించారు. విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా ఎప్పుడూ కనిపించలేదు. కానీ అదే ఆయన చేసిన తప్పు. ఆ కారణంగానే పార్టీకి ఏర్పడాల్సిన ఓటు బ్యాంక్ ఏర్పడలేదు. ఫలితంగా ఆరు శాతం ఓట్లే గత ఎన్నికల్లో వచ్చాయి.


Also Read : పోసాని ఇంటిపై రాళ్ల దాడి - భయపడబోనన్న పోసాని


కాపుల్ని ఏకపక్ష మద్దతుదారులుగా మార్చుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు !
మంగళగిరి సమావేశంలో పవన్ కల్యాణ్ కాపు కులం ప్రస్తావన.. వంగవీటి రంగా గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. కాపు సామాజికవర్గంలో వంగవీటికి ఉన్న ప్రత్యేక గుర్తింపును వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. వంగవీటి రంగాను కలవలేదని కానీ చూశానన్నారు. ఆయన సభలు పెడితే కృష్ణాతీరం నిండిపోయేదని చెప్పేవాళ్లన్నారు. రంగాకు అప్పటి పాలకుల నుంచిప్రాణభయం ఉన్నా... సత్యాగ్రహం చేస్తూంటే చుట్టూ వంద మంది కూర్చుని ఉన్నా రక్షించుకోలేకపోయారని గుర్తు చేశారు. కాపులకు అధికారం రావాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ ప్రసంగంలో ఎప్పుడూ లేని విధంగా కులం గురించి అదీ కూడా కాపు సామాజికవర్గం గురించి ఎక్కువగా మాట్లాడటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు తన బలం.. బలగం ఏమిటో గుర్తించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. తాను నిర్లక్ష్యం చేస్తూండటంతో తన ఓటు బ్యాంక్‌ను కైవసం చేసుకునేందుకు ఇతర పార్టీలు సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ  తనపై కులం ముద్ర పడటం పవన్ కల్యాణ్‌కు ఇష్టపడలేదు.


Also Read : టెంట్ హౌస్‌లా పార్టీని కిరాయికి ఇస్తారు.. ఇండస్ట్రీతో పవన్‌కు సంబంధం లేదన్న పేర్ని నాని


కాపు రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు ప్రణాళికలు ! 
గతంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం జరిగినప్పుడు.. నాయకత్వం వహించే అవకాశం వచ్చినా తనపై ముద్ర పడకూడదని లైట్ తీసుకున్నారు. కానీ అలాంటి చర్యల వల్ల.. ప్రతీ పార్టీకి పునాదిలాగా ఉండాల్సిన ఓటు బ్యాంక్ వర్గం జనసేనకు ఏర్పడలేదని.. ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. ఏపీలో గణనీయ సంఖ్యలో ఉన్న కాపు సామాజికవర్గం ఏకతాటిగా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిస్తే.. బలమైన పోటీదారు అవుతారు. ఈ అంశాన్ని పవన్ గుర్తించినట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల కాపు రిజర్వేషన్లపైనా గళమెత్తుతున్నారు.  గత జూన్‌లో కాపు రిజర్వేషన్లపై ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహంచారు. అప్పుడు కాపు రిజర్వేషన్లను రెడ్డి నేతలే తీసేశారని విమర్శించారు. మొదట్లో బీసీలుగా ఉన్న కాపులను నీలం సంజీవ రెడ్డి ఓసీల్లో చేర్చారు. అప్పట్నుంచి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. మధ్యలో దామోదరం సంజీవయ్య 1961లో కాపులను మళ్లీ బీసీల్లో చేరిస్తే.. కాసు బ్రహ్మానంద రెడ్డి తీసేశారన్నారు. 56 ఏళ్లుగా కాపుల పట్ల కపట ప్రేమను నటిస్తూ ఓట్లు దండుకుంటున్నారని పరోక్షంగా రెడ్డి నాయకులపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు రిజర్వేషన్లు ఇస్తానన్న విధానాన్ని కూడా తప్పు పట్టిన పవన్ కల్యాణ్.. బి.సి.కోటా లో కాపులకు చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లను జగన్ రద్దు చేయడంపై విరుచుపడ్డారు. మంగళగిరిలో పవన్ కల్యాణ్ మాట్లాడిన వైనంచూస్తే కాపుల కోసం మరింత దూకుడుగా పవన్ కల్యాణ్ రాజకీయం చేసే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Watch Video : వాళ్లు చెప్పారనే టికెట్ల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశాను: పవన్
 
పొత్తులూ డోంట్ కేర్ ... ఒంటరి పోరాటానికే మొగ్గు ! 
పవన్ కల్యాణ్‌పై ప్రధానంగా ఉన్న రాజకీయ విమర్శల్లో ఒకటి.. నిలకడ లేకపోవడం. పవన్ కల్యాణ్ రాజకీయ పయనాన్ని చూస్తే మొదట ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చారు. తర్వాత ఎన్నికలకు వచ్చే సరికి కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికలు ముగిశాక సందర్బం లేకపోయినా బీజేపీతో  పొత్తులు పెట్టుకున్నారు. ఇలాంటి వ్యవహారాలతో  ఆయనపై ఇతర పార్టీలు విమర్శలు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆశయం కోసం వ్యూహం మార్చుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని పవన్ కల్యాణ్ ప్రసంగంలో పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ  ఒంటరిగా ముందుకెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అయన పరోక్షంగా చెప్పినట్లయిందంటున్నారు. కొన్నాళ్లుగా  బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ అది ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. రెండు పార్టీల నేతలు ఎప్పుడూ కలసి పోరాటం చేయడం లేదు. కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలపై పవన్ కల్యాణ్‌కు అంత సదభిప్రాయం లేదు. దానికి కారణంగా ఏపీ బీజేపీ నేతల తీరేనని చెబుతూంటారు.   బీజేపీ- జనసేన ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ  కమిటీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుని సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు. కానీ ఆ సమావేశాలు చివరి సారిగా ఎప్పుడు జరిగాయో రెండు పార్టీల నేతలకు అసలు అసలు గుర్తుందో లేదో తెలియదు. బీజేపీ తీరు వల్ల జనసేన క్యాడర్‌లోనూ అసంతృప్తి పెరిగిపోతోంది. స్థానిక ఎన్నికల తర్వాత... తిరుపతి మున్సిపల్ ఉపఎన్నిక తర్వాత బీజేపీ - జనసేన మధ్య గ్యాప్ బాగా పెరిగింది. దీన్ని సరి చేసుకునే ప్రయత్నాన్ని ఏపీ బీజేపీ నాయకత్వం చేయలేదు. అవసరమైనప్పుడు ఓ ట్వీట్ చేసి సరి పెడుతూంటారు.


Watch Video : ఇన్నాళ్లు సామాజిక సేవకుడిగా ఆలోచించా... ఇక రాజకీయాలే చేస్తా: పవన్


బీజేపీతో పొత్తుపై జనసేన క్యాడర్‌లో అసంతృప్తి ! 
బీజేపీతో పొత్తుపై జనసేన క్యాడర్‌లోచాలా రోజులుగా అసంతృప్తి ఉంది. విజయవాడలో జనసేన బలంగా ఉంది. అయితే అక్కడ ఒక్కటంటే ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఓటమికి కారణం భారతీయ జనతా పార్టీనేనని.. జనసేన పోస్టుమార్టం నిర్వహించుకుని తేల్చేసింది. జనసేన ఓటమికి బీజేపీనే కారణమని విజయవాడలో జనసేన తరపున అన్నీ తానై వ్యవహరించిన పోతిన మహేష్‌ తేల్చేసారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి రాలేదని..  బీజేపీతో పొత్తు వల్ల మైనార్టీలు జనసేనను వ్యతిరేకించారని ...  బీజేపీతో పొత్తు వల్ల గెలిచే స్థానాల్లో కూడా ఓడామని నివేదికను హైకమాండ్‌కు సమర్పించారు. బీజేపీ వాళ్లను ఇక కృష్ణానదిలో కలిపేశామని..ఇది రికార్డు చేస్కోవచ్చని.. ఎవరికి భయపడబోమని అప్పట్లో ఆయన ప్రకటించారు. పోతిన మహేష్ నేరుగా చెప్పారు ఇతర ప్రాంతాల నేతలు సైలెంట్‌గా తమ ఫీడ్ బ్యాక్‌ను హైకమాండ్‌కు పంపారు. కొంత స్థానిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తుల వల్ల ప్రయోజనంలేదని స్థానిక నాయకత్వం టీడీపీతో పొత్తులు పెట్టుకుంది.  టీడీపీ - జనసేన స్థానిక నేతలు పొత్తులు పెట్టుకున్న చోట మంచి ఫలితాలు వచ్చాయి. బీజేపీతో వచ్చే ఉపయోగం ఏమీ లేదని ఫలితాల సహితంగా జనసేనానికి క్యాడర్ స్పష్టమైన సంకేతం పంపింది. ఇది పవన్ కల్యాణ్‌ను ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు. అందుకే పొత్తుల విషయంలో ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడారని అంటున్నారు.  


Also Read : ఎలాంటి యుద్ధానికైనా సిద్దం .. వైఎస్ఆర్‌సీపీ నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక !


మాటలు .. చేతల్లోకి మారినప్పుడే ముందడుగు ! 
పవన్ కల్యాణ్‌పై ఓ అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలంగా ఉంది. ఆయన మాటలు మాత్రం ఆవేశంగా చెబుతారని.. చేతలు మాత్రం గడప దాటవన్న అభిప్రాయం ఉంది. ఇంతకు ముందు ఆయన ఎన్నో ప్రకటనలు చేశారు. కానీ ఏ ఒక్కటీ చిత్తశుద్ధితో పూర్తి చేయలేకపోయారు. పాదయాత్ర కావొచ్చు.. రైతుల సమస్యలు కావొచ్చు.. రాజధాని రైతులకు అండగా ఉండటం కావొచ్చు.. ఏదైనా కానీ ఆయన వైపు నుంచి ప్రారంభంలో మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ రంగంలోకి మాత్రం దిగడం లేదు. ఈ కారణంగానే పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడటం సహజమేనని ఆ ఊపు రాజకీయ రంగం మీద చూపించరన్న అభిప్రాయం బలపడింది. అయితే గతంలో పోలిస్తే పవన్ కల్యాణ్ రాజకీయంలోఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తన బలం ఏమిటో.. బలహీనత ఏమిటో గుర్తించగలగుతున్నారు. ఇక కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా ఆయన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారన్న అభిప్రాయాలు సహజంగానే వినిపిస్తాయి. అది ఒంటరిగానా.. వ్యూహాత్మక పొత్తులతోనే అన్నది తర్వాతి విషయం. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ ఒంటరిగా ట్రాక్‌లో పరుగెత్తే సమయం వచ్చింది. ఆయన పరుగు కూడా ప్రారంభించారు. అది లక్ష్యం చేరే వరకూ ఆగకుండా ఉంటే జనసేనాని చరిత్ర సృష్టించడం ఖాయమనేది ఎక్కువ మంది అభిప్రాయం. 


 


Also Read : బద్వేలు బరిలో బీజేపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థి ! పోటీకి ఎవరు ముందుకు వస్తారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి