తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని వాపోయారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో ‘ప్రజా గొంతుకకు ప్రణామం’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహంచారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకులను నట్టేట ముంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన గండ్ర వెంకటరమణారెడ్డికి రాజకీయ మనుగడలేదని అన్నారు. భూపాలపల్లి ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు గండ్రకు మరణశాసనం రాయబోతున్నారని ఆరోపించారు. అతనికి ఇదే చివరి ప్రజా జీవితమని అన్నారు. భూపాలపల్లికి సరైన రోడ్లు, నీటి సౌకర్యం లేవని తెలిపారు. గండ్ర వెంకటరమణారెడ్డి గాలి, నీటిని సైతం కొల్లగొట్టారని మండిపడ్డారు. ఈ సభలో కాంగ్రెస్‌ నేతలు శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు సభలో పాల్గొన్నారు. 



కాంగ్రెస్​లో చేరిన గండ్ర సత్యనారాయణ రావు.. 
భూపాలపల్లి సభ వేదికగా గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్​లో చేరారు. గండ్ర సత్యనారాయణకు రేవంత్ కాంగ్రెస్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సత్యనారాయణతో పాటు నియోజకవర్గంలోని పలువురు నాయకులు పెద్దఎత్తున కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరుతున్న వారందరికీ రేవంత్​రెడ్డి, మధుయాష్కీ గౌడ్​, సీతక్క.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. నమ్ముకున్న పార్టీలు తనను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్​కు డబ్బు మీద వ్యామోహం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. 


Also Read: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ మరో లేఖ.. గాలేరు పనులను నిలువరించాలని వినతి..


సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారు: జీవన్ రెడ్డి 
సింగరేణి ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. భూపాలపల్లి సభలో ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం పేరుతో కథలు చెబుతున్నారే కానీ ఒక్క ఇళ్లూ కట్టించలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతీ గింజా కొంటామని హామీ ఇచ్చారు. రైతులు కేసీఆర్‌కు ఉరిబిగించే సమయం వచ్చిందని తెలిపారు. ఈ జన సమూహాన్ని చూస్తే టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరగెడుతున్నాయని ఎద్దేవా చేశారు.


Also Read: పవన్ పై ఏపీ మంత్రులు ఫైర్.. జగన్ ను మాజీ సీఎం చేస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని మంత్రి కొడాలి నాని కౌంటర్


కల్వకుంట్ల కాదు.. కలవకుండా: మధుయాష్కీ 
టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ విరుచుకుపడ్డారు. భూపాలపల్లి కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడుతూ.. దళితబంధుతో టీఆర్ఎస్ మరోసారి దగా చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ఇంటిపేరు కల్వకుంట్ల కాదు.. కలవకుండా అని ఓ కవి అన్నారని పేర్కొన్నారు. తాగుడు గాళ్లు, వాగుడు గాళ్లు, గోకుడు గాళ్లు, గీకుడు గాళ్లు, గులాం గాళ్లు, గులాబీ గాళ్లు అని ఓ కవి రాశాడని ఎద్దేవా చేశారు.  కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొందపెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 


Also Read: తెలంగాణలో తైవాన్ కంపెనీలకు అధిక ప్రాధాన్యత.. మంత్రి కేటీఆర్ వెల్లడి


Also Read: తెలంగాణ చెబుతున్నవన్నీ అబద్ధాలే.. డీపీఆర్‌లను ఆమోదించొద్దు.. జీఆర్ఎంబీకి ఏపీ లేఖ 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి