తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు ఆమోదం తెలపవద్దని గోదావరి బోర్డు, కేంద్ర జల్ శాక్తి శాఖలకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని మళ్లిస్తుందని ఏపీ ప్రభుత్వ తెలిపింది. ఈ ప్రాజెక్టుల వల్ల దిగువనున్న పోలవరం ప్రాజెక్టులోకి ప్రవాహం తగ్గిపోతుందని వెల్లడించింది.
తెలంగాణ నీటిపారుదల శాఖ సీతారామ, తుపాకులగూడెంతోపాటు అయిదు ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఆమోదం కోసం గోదావరి బోర్డుకు సమర్పించింది. అయితే బోర్డు ఈ డీపీఆర్‌లను ఆంధ్రప్రదేశ్‌కు పంపి అభిప్రాయాలను చెప్పాలని కోరింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు గోదావరి బోర్డు ఛైర్మన్‌కు, కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శికి లేఖలు రాశారు. డీపీఆర్‌లను ఆమోదించవద్దని కోరారు.
గోదావరిలోని 12 ఉపనదుల్లో 11.. ఎగువ రాష్ట్రాల నుంచి తెలంగాణ ద్వారా ప్రవహిస్తున్నాయని.. శబరి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిలో కలుస్తుందని.. ఆంధ్రప్రదేశ్ దిగువన ఉన్న రైపేరియన్ రాష్ట్రమైనా, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా గోదావరి జలాల్లో ఏడాది పొడవునా ఎక్కువగా వాడుకోవడానికి అవకాశం ఉందని లేఖలో ఏపీ తెలిపింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఒప్పందం లేదా ట్రైబ్యునల్ అవార్డు ద్వారా జరగాలని 2016లో జరిగిన గోదావరి బోర్డు మూడో సమావేశంలో తెలంగాణ పేర్కొందని వెల్లడించింది.
పునర్విభజన తర్వాత 75 శాతం నీటి లభ్యత కింద రెండు రాష్ట్రాలు అప్పటికే వినియోగంలో ఉన్న, నిర్మిస్తున్న ప్రాజెక్టుల కింద తమ నీటి వినియోగాన్ని మార్పు చేసుకొన్నాయని.. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ వాటా 776 టీఎంసీలు కాగా, తెలంగాణది 650 టీఎంసీలు అని తెలిపింది. మొత్తం నీటి లభ్యత 1,430 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలు కలిపి 1,426 టీఎంసీలు వినియోగించుకొనేలా చేపట్టాయి. కాబట్టి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నీటి లభ్యత లేదని ఏపీ స్పష్టం చేసింది.
కిందటి సంవత్సరం అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్‌లో గోదావరి జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్ ఏర్పాటుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు లేఖలో గుర్తు చేశారు. తెలంగాణ చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో 1,355 టీఎంసీలు వినియోగించుకొంటుందని తెలిపారు. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రికి లేఖ రాసిన విషయం చెప్పారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు ట్రైబ్యునల్ అవార్డు, అంతర్‌రాష్ట్ర ఒప్పందాలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఇవేమీ పట్టించుకోకుండా.. తెలంగాణ ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మించి, నీటిని మళ్లించడం సరికాదని శ్యామల రావులో లేఖలో స్పష్టం చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం