బ్రెస్ట్ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ (UBF) యూబీఎఫ్ హెల్ప్‌లైన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. రొమ్ము క్యాన్సర్ లేదా రొమ్ము సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి దీని ద్వారా సాయాన్ని అందించనుంది. ఈ యూబీఎఫ్ హెల్ప్‌లైన్ కార్యక్రమాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రొమ్ము సంబంధిత సమస్యలపై తెలుగు సహా 12 భాషల్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. క్యాన్సర్ చికిత్సలో కౌన్సెలింగ్ పాత్ర కీలకమని.. రోగికి తెలిసిన భాషలో అవగాహన కల్పిస్తేనే వారికి సరిగా అర్థమై ధైర్యం వస్తుందని తెలిపారు. రొమ్ము క్యాన్సర్‌ను జయించిన వారి మాటలు బాధితులకు భరోసా ఇస్తాయని.. వారి ద్వారా అవగాహన కల్పించడం సంతోషకరమని పేర్కొన్నారు.
Also Read: ఈ ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారచ్చు... జాగ్రత్త పడండి
క్యాన్సర్ చికిత్స వ్యయాన్ని తగ్గించాలి..
ప్రపంచవ్యాప్తంగా 3.2 మిలియన్ల రొమ్ము క్యాన్సర్ కేసులు వెలుగు చూశాయని వెంకయ్య తెలిపారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కంటే ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు 2020 నివేదికలు చెబుతున్నాయని ప్రస్తావించారు. చాలా రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే అవకాశం ఉందన్నారు. అవగాహనతోనే ఇది సాధ్యమని అభిప్రాయపడ్డారు. రొమ్ము సమస్యలతో బాధ పడుతున్న వారికి అండగా నిలిచి అవగాహన కల్పించడమే యూబీఎఫ్ హెల్ప్ లైన్ లక్ష్యమని చెప్పారు. క్యాన్సర్ రోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని.. ఈ వ్యాధి చికిత్స వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. రొమ్ము సంబంధిత సమస్యలను క్యాన్సర్‌గా భావించవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూబీఎఫ్ ఛైర్మన్ డాక్టర్ రఘురామ్, డాక్టర్ ఉషాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఇరవై మూడేళ్లకే ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన విజేత... ఇప్పుడు అతడో స్పూర్తిప్రదాత
Also Read: క్యాన్సర్ మహమ్మారిని జయించిన పలువురు సెలబ్రెటీలు