జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇరు పార్టీల నేతలు సమావేశమయ్యారు. బద్వేలు ఉప ఎన్నిక, తాజా రాజకీయ పరిణామాలపై ఇరు పార్టీల నేతలు చర్చించారు. అక్టోబర్‌ 2న జనసేన చేపట్టే శ్రమదానం వివరాలను పవన్ సోము వీర్రాజుకు తెలిపారు. అక్టోబర్‌ 7న నెల్లూరులో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మత్స్య గర్జన సభ వివరాలను ఆ పార్టీ నేతలు పవన్‌కు వివరించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బద్వేలు ఉపఎన్నికల అభ్యర్థిపై చర్చించినట్లు సమాచారం. ఇరు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే యోచనలో పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉపఎన్నికలో బీజేపీకి వదిలేసిన కారణంతో... బద్వేలులో జనసేన అభ్యర్థి పోటీలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 




Also Read: ‘ఇండస్ట్రీ’ పవన్‌ను వద్దనుకుందా? తమ కోసం పోరాడినా ఒంటరిని చేశారా?


ఉపఎన్నిక అభ్యర్థిపై ఉమ్మడి ప్రకటన


జనసేన పార్టీ గాంధీ జయంతి రోజున ఏపీలో తలపెట్టబోయే రోడ్ల మరమ్మత్తు శ్రమదానం కార్యక్రమాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.  మంచి పని చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులు చేయట్లేదు కాబట్టే తాము చేస్తున్నామన్నారు. కడప జిల్లా బుద్వేల్ ఉప ఎన్నిక అభ్యర్థిపై సాయంత్రంలోగా ప్రకటన చేస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టంచేశారు. రెండు నెలలుగా బీజేపీ-జనసేన అంతర్గత సమావేశాల్లో ఈ విషయంపై చర్చించామన్నారు. ఇరు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చి పార్టీ అభ్యర్థిని ఉమ్మడిగా ప్రకటిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అక్టోబర్‌ 2న పవన్‌ కల్యాణ్‌ చేయబోయే శ్రమదానానికి అధికారులు అనుమతి నిరాకరించారు.


Also Read: మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?


 అనుమతి నిరాకరించిన అధికారులు


కాటన్ బ్యారేజీపై అక్టోబర్‌ 2వ శ్రమదానం చేసేందుకు జనసేన పార్టీ నిర్ణయించింది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నందున వాటిని బాగు చేసి నిరసన తెలపాలని ప్రకటించింది. అయితే శ్రమదానానికి అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. కాటన్ బ్యారేజీ రోడ్ ఆర్ అండ్ బి పరిధిలోకి రాదని వెల్లడించారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలను పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందని అధికారులు తెలిపారు. కాబట్టి అనుమతి కుదరదని స్పష్టం చేశారు. మరోవైపు బ్యారేజీపై శ్రమదానం చేసి తీరుతామని జనసేన కార్యకర్తలు అంటున్నారు.


 Also Read: బద్వేలు ఉపఎన్నికపై సీఎం జగన్ సమావేశం... గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ రావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం... అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాలని ఆదేశం


జీవో 217పై చర్చ


వారసత్వంగా వస్తున్న చేపల వేట, అమ్మకాలపై ఆధారపడ్డ మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టి, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. చెరువులు, రిజర్వాయర్లు లాంటి చోట్ల మత్స్యకార సొసైటీ సభ్యులకు చేపలు వేటాడుకొనే అవకాశం లేకుండా చేస్తున్న జీవో 217 విషయంలో జనసేన పార్టీ ఎలా పోరాడాలనే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను, జీవో 217 తమ జీవనోపాధికి ఎలా విఘాతం కలిగిస్తుందో వివరించారు.


ఆర్థిక బలం చేకూర్చేలా చేయాలి


పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “ప్రజా పోరాట యాత్రను ఇచ్చాపురం ప్రాంతంలో కపాసు కుర్ది దగ్గర గంగమ్మకు పూజ చేసే మొదలుపెట్టాను. కోస్తాలో పర్యటించిన ప్రతి ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల గురించి, ఇక్కడ జీవనోపాధి లేక వలసలపై అవగాహన చేసుకున్నాను. మత్స్యకారుల సమస్యలపై పోరాడటమే కాకుండా... ఈ వృత్తిపై ఆధారపడ్డవారు నైపుణ్యాలు పెంచుకొని ఆర్థికంగా ఎదిగే అంశాలపై అవగాహన కలిగించేందుకే పార్టీ పక్షాన మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేశాం. పాలనలో ఉన్నవారు సైతం సంప్రదాయ వృత్తులపై ఆధారపడ్డ వారికి ఆర్థిక బలం చేకూర్చేలా చేయాలి. అంతేగానీ ఆర్థిక మూలాలను దెబ్బ తీసేలా నిర్ణయాలు చేయకూడదు. చెరువులు, రిజర్వాయర్ల దగ్గర చేపల వేటకు మత్స్యకారులకు అవకాశం లేకుండా చేసి వేలం ద్వారా సమకూరే ఆదాయంలో 70 శాతం ప్రభుత్వమే తీసుకొంటుందనే ఆందోళన మత్స్యకారుల్లో ఉంది” అన్నారు.


Also Read:  రోజుకు వెయ్యి కోట్లు ఆర్జిస్తున్న అదానీ.. ఇండియా టాప్‌-10 కుబేరులు వీళ్లే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి