Nutritional Deficiency : శరీరానికి అవసరమైన పోషకాలు అందించాలి. లేదంటే అది కొన్ని రియాక్షన్స్ ఇస్తుంది. తద్వారా అది తీవ్రమైన ఆరోగ్యపరిస్థితులకు దారితీస్తుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అలసట, చర్మ సమస్యలు వంటివి శరీరంలోని విటమిన్లు, మినరల్స్ లోపానికి గుర్తులని చెప్తున్నారు. అయితే 5 ప్రధాన సంకేతాలు.. ఏ పోషకాల లోపం వల్ల అవి వస్తున్నాయో.. వాటిని ఎలా భర్తీ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


గోళ్లు విరిగిపోవడం దానికి సంకేతమట..


కొందరు చాలా ఇంట్రెస్ట్​గా గోళ్లు పెంచుకుంటూ ఉంటారు. అయితే అవి కొన్ని కారణాల వల్ల విరిగిపోతూ ఉంటాయి. తేలికగా గోళ్లు విరిగిపోతున్నాయంటే అర్థం.. శరీరంలో ప్రోటీన్, ఐరన్ లోపాన్ని సూచిస్తుందని చెప్తున్నారు. 


ప్రోటీన్, ఐరన్ ఫుడ్స్ ఇవే..


శరీరంలో ప్రోటీన్, ఐరన్ లోపాన్ని తగ్గించుకునేందుకు కొన్ని ఫుడ్స్ డైట్​లో చేర్చుకోవాలి. చికెన్, ఎగ్స్, రెడ్​ మీట్​లలో మీరు ఐరన్, ప్రోటీన్ రెండింటినీ పొందొచ్చు. శనగలు, ఆకుకూరలు, నట్స్, సీడ్స్, క్వినోవా, బ్రౌన్ రైస్, సోయా ప్రొడెక్ట్స్, కూరగాయల్లో కూడా ఇవి పుష్కలంగా ఉంటాయి. 


కంటి చివర దురద..


కంటి చివర ఊరికే దురద రావడం, మంట పెట్టడం, ఉబ్బడం వంటి లక్షణాలు ఉన్నాయా? అయితే ఇవి మెగ్నీషియం లోపానికి ప్రధాన సంకేతమట. దీనిని పట్టించుకోకుంటే క్రమంగా నరాల బలహీనతకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట..


తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే


తోటకూర, కాలే, బాదం, గుమ్మడి గింజలు, నువ్వులు, సన్ ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు వంటివి మెగ్నీషియంకి మంచి సోర్స్. కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్, శనగల్లో కూడా మెగ్నీషియం ఉంటుంది. క్వినోవా, బ్రౌన్ రైస్ కూడా మంచిది.



కీళ్ల దగ్గర సౌండ్స్ వస్తుంటే


కొందరు నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా పనులు చేసేప్పుడు, నడిచేప్పుడు జాయింట్ల దగ్గర సౌండ్స్ వస్తాయి. శరీరంలో విటమిన్ డి లోపమున్నప్పుడు ఈ తరహా సౌండ్స్ వస్తాయట. అంతేకాకుండా కాల్షియం తగ్గినప్పుడు ఈ సమస్య వస్తుందని చెప్తున్నారు. 


తినాల్సిన ఫుడ్స్ ఇవే


చేపలు,  పాల ఉత్పత్తులు, మష్రూమ్స్, ఓట్ మీల్, ఆరెంజ్ జ్యూస్, గుడ్డు సొన వంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది. ప్రతిరోజూ కాసేపు ఎండలో కూర్చొన్నా మీకు విటమిన్ డి అందుతుంది. పాల ఉత్పత్తులు, ఆకు కూరలు, ప్లాంట్ బేస్డ్ మిల్క్, నట్స్, విత్తనాలు, ఓట్్ మీల్స్ తీసుకుంటే కాల్షియం అందుతుంది. 



తెల్లవెంట్రుకలు ముందుగానే వస్తే..


చిన్నవయసులో జుట్టు మెరిస్తే బాలమెరుపు అంటారు. అయితే 20, 30లలో తల నెరుస్తుంటే దాని అర్థం శరీరంలో విటమిన్ బి 12 లోపించడమేనట. ఇది శరీరంలోని రక్తకణాల కౌంట్​పై కూడా ప్రభావం చూపిస్తుందట. 


ఇవి తీసుకోండి..


విటమిన్ బి 12 చికెన్, పోర్క్, బీఫ్ మాంసాలలో దొరుకుతుంది. అలాగే పలు రకాల చేపల్లో పాల ఉత్పత్తుల్లో, గుడ్లలో విటమిన్ బి 12 ఉంటుంది. లేదంటే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. 


జుట్టు ఎక్కువగా రాలుతోందా?


జుట్టుకి ఎంత కేర్​ తీసుకున్నా ఎక్కువగా రాలిపోతుందా? అయితే ఇది శరీరంలో కాపర్ లోపాన్ని సూచిస్తుంది. ఇది శరీరంలో మెలనిన్​ని పెంచి.. స్కిన్​ టోన్​ని డల్ చేస్తుంది. 


తినాల్సిన ఫుడ్స్


చేపల్లో కొన్ని రకాలు బాదం, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పూలు గింజలు, నువ్వులు, పప్పు ధాన్యాలు, శనగలు, బ్రౌన్ రైస్, క్వినోవా వంటివాటిలో కాపర్ పుష్కలంగా ఉంటుంది. 


బ్లడ్ క్లాట్ అవుతుంటే..


రక్తం గడ్డలు కట్టడానికి విటమిన్ సి, విటమిన్ కె ప్రధానకారణమంటున్నారు. చిన్న దెబ్బకే పెద్ద మచ్చకావడం.. గడ్డకట్టడం జరుగుతాయి. 


తీసుకోవాల్సిన ఫుడ్స్


విటమిన్ సి కోసం సిట్రస్ ఫుడ్స్ తీసుకోవచ్చు. కూరగాయల్లో కూడా పెప్పర్, బ్రకోలి, కాలీఫ్లవర్, తోటకూర వంటివి వండుకోవచ్చు. తోటకూర, కాలే, బ్రకోలి వంటివాటిలో విటమిన్ కె ఉంటుంది.


ఈ లోపాలుంటే అస్సలు అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో ఫుడ్స్ బదులుగా సప్లిమెంట్స్ ఉపయోగించేవారు కూడా ఉన్నారు. అయితే మీరు ఏ విధంగా ఈ పోషకాల లోపాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారనేది మీ వైద్యులతో చర్చించండి. వారి సూచనలు ఫాలో అయితే మంచిది. 


Also Read : మగవారిలో గుండె సమస్యలు పెరగడానికి కారణం ఇదే.. కారకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు