Show Cause Notice To Ola Electric: నాసిరకం సేవలతో కస్టమర్ల తిట్లు తింటున్న ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ, తన తప్పు తెలుసుకోకుండా ముప్పు మరింత పెంచుకుంటోంది. ఈ కంపెనీ షేరు విలువ గరిష్ట స్థాయి నుంచి దాదాపు 43 శాతం పడిపోయింది. మరోవైపు.. బజాజ్ ఆటో, టీవీఎస్‌ మోటార్స్ కూడా ఆ కంపెనీ మార్కెట్ వాటాను వేగంగా లాక్కుంటున్నాయి. సేవల్లో ఆలస్యంపై ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీష్ అగర్వాల్ (Ola Electric CEO Bhavish Aggarwal) - స్టాండప్‌ కమెడియన్‌ కునాల్ కమ్రా (Kunal Kamra) మధ్య మాటల యుద్ధం జరిగింది. తాజాగా, పెరుగుతున్న కస్టమర్ల ఫిర్యాదుల కారణంగా ఈ కంపెనీకి షోకాజ్ నోటీసు కూడా అందినట్లు సమాచారం. ఈ నోటీసును సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) పంపింది. 


స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్ తర్వాత ఓలా ఎలక్ట్రిక్ అద్భుతాలు చేసింది. దీని షేర్లు రూ.76 వద్ద లిస్టయి, గరిష్టంగా రూ.157.4 వద్దకు చేరాయి. కానీ, ఆ తర్వాత మొదలైన పతనం ఈ రోజుకూ ఆగలేదు. ఇప్పుడు, కస్టమర్ల ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ CCPA నుంచి షోకాజ్‌ నోటీసు అందుకోవడం ఈ కంపెనీకి పెద్ద దెబ్బ. షోకాజ్‌ నోటీస్‌ విషయంపై ఓలా ఎలక్ట్రిక్ మౌనం పాటించింది. ఈ వార్త రాసే సమయానికి ఆ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 


నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌కు 10,644 ఫిర్యాదులు
CCPA పంపిన నోటీసులో, వినియోగదార్ల రక్షణ చట్టంలోని అనేక సెక్షన్‌లను ఓలా ఎలక్ట్రిక్‌ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. పేలవమైన సేవ, తప్పుడు ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. షోకాజ్‌ నోటీసుపై స్పందించడానికి CCPA ఆ కంపెనీకి 15 రోజుల గడువు ఇచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, కేంద్ర వినియోగదార్ల వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో పని చేస్తున్న 'నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌'కు గత ఏడాది కాలంలో ఓలా ఎలక్ట్రిక్‌ మీద 10,644 ఫిర్యాదులు అందాయి. ఓలా స్కూటర్ల సర్వీస్ పరమ నాసిరకంగా ఉందని అన్ని ఫిర్యాదుల్లో కామన్‌గా ఉంది.


చాలా విషయాల్లో ఫిర్యాదులు
తయారీ లోపాలతో కూడిన స్కూటర్లను విక్రయిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. బుకింగ్ రద్దు చేసుకుంటే, డబ్బు వాపసు ఇవ్వడంలోనూ ఆ కంపెనీ ఇబ్బంది పెట్టినట్లు కొందరు చెప్పారు. బ్యాటరీలు, ఇతర విడిభాగాలకు సంబంధించిన పోస్ట్-సర్వీస్ సమస్యల గురించి కూడా ఫిర్యాదుల్లో ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్‌పై వస్తున్న ఆరోపణల గురించి కన్స్యూమర్ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ నిధి ఖరే ధృవీకరించారు, ఈ విషయంపై CCPA దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్యలను కంపెనీ త్వరలోనే పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 


టోల్‌ ఫ్రీ నంబర్‌ 1915 
మీరు కూడా ఓలా ఎలక్ట్రిక్‌ కస్టమర్‌ అయితే, కంపెనీ సర్వీస్‌తో విసిగిపోయి ఉంటే, 'నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌' టోల్ ఫ్రీ నంబర్ 1915 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.


మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌లో మిక్స్‌డ్‌ ఓపెనింగ్ - కళ కోల్పోయిన మెటల్స్‌, ఆటో షేర్లు