Detachment for Personal and Professional Growth : డిటాచ్మెంట్ అనేది లైఫ్‌లో ఉంటే ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూడొచ్చని చెప్తున్నారు మానసిక నిపుణులు. న్యూ ఇయర్ 2025లో దీనితో పర్సనల్, ప్రొఫెషనల్ గ్రోత్ చూడవచ్చని చెప్తున్నారు. డిటాచ్మెంట్ను తెలుగులో నిర్లిప్తత అంటారు. అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఓ వ్యక్తి తన ఆలోచనలను, భావోద్వేగాలను, భౌతిక అవసరాలనుంచి.. తనని తాను వేరు చేసుకోవడాన్నే డిటాచ్మెంట్ అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే.. ఇలా డిటాచ్ కావడం నేర్చుకోకుంటే.. మీరు లోకసంబంధం బాంధవ్యాల్లో చిక్కుకుపోవడం ఖాయం. అది మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుందని చెప్తున్నారు.
డిటాచ్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే..
ఎమోషనల్ డిటాచ్మెంట్ : కోపం, విచారం, ఆందోళన వంటి స్ట్రాంగ్ ఎమోషన్స్ నుంచి తనను తాను బయటపడేలా చేసుకోవడమే ఎమోషనల్ డిటాచ్మెంట్.
మెంటల్ డిటాచ్మెంట్ : నెగిటివ్ ఆలోచనలు, చింతలు, లోలోపల జరిగే సంఘర్షణల నుంచి మానసికంగా బయటపడడమే మెంటల్ డిటాచ్మెంట్.
ఫిజికల్ డిటాచ్మెంట్ : శారీరకంగా కలిగే నొప్పి నుంచి.. లేదా అసౌకర్యం గురించి ఆలోచించకుండా ఉండగలగడమే ఫిజికల్ డిటాచ్మెంట్.
ఆధ్యాత్మికంగా డిటాచ్మెంట్ : మత విశ్వాసాలు, ఆచారాలు, మూఢనమ్మకాలు, వాటివల్ల వచ్చే ఫలితాలకు దూరంగా వెళ్లడమే స్పిర్చ్యువల్ డిటాచ్మెంట్.
డిటాచ్మెంట్ వల్ల కలిగే లాభాలు ఇవే..
డిటాచ్మెంట్ అనేది కొందరు తప్పుగా తీసుకుంటారు కానీ.. దీనివల్ల కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు. ఇది ఒత్తిడిని, యాంగ్జైటీని దూరం చేస్తుంది. మీ ఎమోషన్స్‌ని అతిగా వెళ్లకుండా ఇది హెల్ప్ చేస్తుంది. మానసికంగా మీకు క్లారిటీ పెరుగుతుంది. మిమ్మల్ని డైవర్ట్ చేసే అంశాలు ఎక్కువగా ఉండవు. కాబట్టి మీ గోల్ మాత్రమే మీకు క్లారిటీగా కనిపిస్తుంది.
మీ గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. మీ లక్ష్యాలు, మీ విలువలు కాపాడుకోవడంలో అవగాహన మెరుగవుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. బాహ్యా ఫలితాలతో సంబంధం లేకుండా ఎఫర్ట్స్ పెడతారు. ఎలాంటి ఫలితమొచ్చినా దానిని కూల్‌గా రిసీవ్ చేసుకోగలుగుతారు. ఇది మెంటల్ బ్రేక్‌డౌన్ కాకుండా హెల్ప్ చేస్తుంది. వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడుతుంది.
పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడకుండా.. మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోవడంలో హెల్ప్ చేస్తుంది. రిలేషన్షిప్స్ మెరుగవుతాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్ ఇలా ఎవ్వరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఇలాంటప్పుడు అవతలి వ్యక్తికి మీరు భారం కారు. అవతలి వ్యక్తి విలువలని రెస్పెక్ట్ ఇస్తూ ముందుకు వెళ్లగలుగుతారు.
ఎలా నేర్చుకోవాలి?
రోజూ మెడిటేషన్ చేయడం వల్ల డిటాచ్మెంట్ అనేది అలవాటు అవుతుంది. మీ శరీరానికి, మనసుకు ఏమి కావాలో తెలుసుకోవచ్చు. అవసరం లేని వాటిని విస్మరించగలిగే శక్తి మీకు అందుతుంది. మైండ్‌ఫుల్‌నెస్ వల్ల ఆలోచనలు, ఎమోషన్స్, ఫిజికల్ సెన్సేషన్స్ కంట్రోల్ అవుతాయి. ఎక్కువకాలం ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. యోగా నిద్రను మెరుగుపరుస్తుంది. అలాగే మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
జర్నలింగ్ చేస్తూ ఉంటే చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండడంలో హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మీ ఎమోషన్స్‌ని, ఆలోచనలని రాస్తూ ఉంటే.. మీరు వాటి నుంచి ఈజీగా డిటాచ్ అవ్వగలుగుతారు. అంతేకాకుండా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కి కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది.
డీప్ బ్రీతింగ్, స్లో బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఫిజికల్ యాక్టివిటీ కూడా డిటాచ్లో భాగమే. ఇది మిమ్మల్ని శారీరకంగా కూడా హెల్తీగా మార్చుతుంది. కండరాలను రిలాక్స్ చేసే టెక్నిక్స్ కూడా మంచి ఫలితాలనిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో.. మీకు నచ్చినప్రదేశంలో మీరు ఉన్నట్లు ఊహించుకోవడం వల్ల కూడా డిటాచ్మెంట్లో మీరు సక్సెస్ అవుతారని చెప్తున్నారు నిపుణులు.
Also Read : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా