ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని ప్రపచం ఆరోగ్య సంస్థ వెల్లడించింది. శుక్రవారం విడుదల చేసిన నివేదికలో మరిన్ని సంచలనమైన విషయాలు ప్రస్తావించింది.
కరోనా కంటే ముందు కూడా చాలా మంది ప్రజలు మానసి అనారోగ్యంతో ఉండేవాళ్లని పేర్కొంది WHO. ఒక బిలియన్ ప్రజల్లో ఈ సమస్య ఉండేదని తెలిపింది. ఇందులో 14 శాతం యుక్తవయసు వారేనని వివరించింది. కరోనా తర్వాత ఈ సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిందని వెల్లడించింది.
WHO నివేదిక ప్రకారం... కరోనా వ్యాప్తి చెందిన మొదటి ఏడాదిలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలు 25 శాతానికిపైగా వృద్ధి చెందింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం చాలా దేశాలు తమ బడ్జెట్‌లో రెండు శాతాని కంటే తక్కువ మానసిక ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్నాయి. దీని వల్ల ఆయా దేశాల్లో తత్ఫలితంగా... కొద్ది మందికే సమర్థవంతమైన, సరసమైన, నాణ్యమైన మానసిక ఆరోగ్య సంరక్షణ లభిస్తుంది.
ఈ పరిస్థితిలో మార్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని.. అవగాహన కల్పించాలని మానసిక ఆరోగ్య పరిరక్షకులను, న్యాయనిపుణులను ప్రపంచ ఆరోగ్య సంస్థ రిక్వస్ట్ చేసింది. మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వాలు, ప్రజలు శ్రద్ధ చూపేలా ప్రయత్నాలు మొదలు పెట్టాలని హితవులు పలికింది.
ప్రతి మనిషి జీవితంలో మానసిక ఆరోగ్యం అనేది చాలా అవసరం. మానసిక ఆరోగ్యంపై ఖర్చు పెడితే.. అది మంచి జీవితానికి ఉపయోగపడుతుందని, తద్వారా మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఒక ప్రకటనలో తెలిపారు.
మానసిక ఆరోగ్య బాగా లేని వ్యక్తులపై వివక్ష చూపడాన్ని తప్పుపట్టింది ప్రపంచ ఆరోగ్యం సంస్థ. ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని పిలుపునిచ్చింది. 20 దేశాలు ఇప్పటికీ ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించాయని ఉటంకించింది.
ప్రపంచవ్యాప్తంగా 20 మంది ఆత్మహత్యాయత్నం చేసుకుంటే అందులో ఒకరు మరణిస్తున్నారని.. ప్రతి 100 మరణాల్లో ఒకటి కంటే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయని పేర్కొంది.
ఓ ప్రాథమిక అంచనా ప్రకారం స్కిజోఫ్రెనియా... దాదాపు 200 మంది పెద్దల్లో ఒకరికి వస్తుంది. ఇది ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది.
మానసిక ఆరోగ్య పరిస్థితులు జీవన నాణ్యతను ప్రభావితం చేయడంతోపాటు, ఆర్థిక పరిణామాలపై కూడా ప్రభావితం చూపిస్తాయి. మానసిక ఆరోగ్యం, ప్రజారోగ్యం, మానవ హక్కులు, సామాజిక-ఆర్థిక అభివృద్ధి మధ్య విడదీయరాని సంబంధాలు ఉంటాయి. అందుకే మానసిక ఆరోగ్యంలో సరైన విధానాలు తీసుకొస్తే... ప్రతిచోటా వ్యక్తులు, సంఘాలు, దేశాలకు మంచి జరగనుంది" అని ఘెబ్రేయేసస్ చెప్పారు.
సమగ్ర మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక 2013-2030 అమలును వేగవంతం చేయాలని అన్ని దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక కోరింది. మానసిక ఆరోగ్యంపై ఖర్చు పెంచాలని సూచించింది. మానసిక అనారోగ్యంతో ఉన్న వాళ్లను సమాజంలో స్వేచ్ఛగా తిరగనీయకుండా ఉంచే అడ్డంకులను తొలగించాలంది.