అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా 'బంగార్రాజు' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి రేసులో దించుతున్నారు. జనవరి 14న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న నాగార్జునకు మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. 

 

ముందుగా 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సినిమాలు వాయిదా పడడం మీరు అడ్వాంటేజ్ గా భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. 'వాళ్లంతా చాలా కష్టపడ్డారు. 'ఆర్ఆర్ఆర్' నాలుగైదేళ్ల క్రితం మొదలైంది.. అది పాన్ ఇండియా సినిమా.. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఆడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదు.. 'రాధేశ్యామ్' పరిస్థితి కూడా అంతే.. ఇదొక దురదృష్టకరం. ఆ సినిమాలు వాయిదా పడడంతో నేను బాధపడ్డాను. అయితే అది నాకు అడ్వాంటేజా అంటే రిలీజ్ తరువాత చూద్దాం' అంటూ చెప్పుకొచ్చారు. 

 

టికెట్ రేట్ ఇష్యూ గురించి స్పందించమని నాగ్ ని కోరగా.. 'సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు.. నేను మాట్లాడను' అని తేల్చి చెప్పారు నాగార్జున. ఏపీలో మీ సినిమాపై కమర్షియల్ గా ఎఫెక్ట్ పడుతుందేమోనని ప్రశ్నించగా.. 'నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. టికెట్ రేట్స్ పెరిగితే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే..' అని బదులిచ్చారు నాగ్. అనంతరం కలెక్షన్స్ గురించి, హయ్యెస్ట్ గ్రాసర్ గురించి టాపిక్ రాగా.. నెంబర్స్ గేమ్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయానని చెప్పారు నాగార్జున. నెంబర్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయని చెప్పారు. అయితే, టికెట్ల ధరలపై నాగ్ చేసిన వ్యాఖ్యలు నిర్మాతలకు కాస్త ఇబ్బందికరమే అనిపిస్తోంది.