సినిమా టిక్కెట్ల వివాదం ఏమిటో అర్థం కావడం లేదని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన టిక్కెట్ల అంశంపైనా స్పందించారు. సినిమా టిక్కెట్ల అంశంలో వివాదం ఏముందని ఆయన ప్రశ్నించారు. టిక్కెట్ల వివాదం ఇంకా ముదురుతుందని అనుకోవడం లేదని.. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి తాము టిక్కెట్ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఏడాదికో ఒకటో.. రెండో సినిమాలు మాత్రమే చేస్తారన్నారు. ఆయన సినిమా యాబై లేదా వంద.. లేదా రెండు వందల కోట్లు కలెక్షన్లు వసూలు చేస్తాయన్నారు. దాని కోసం ప్రత్యేకంగా రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
సినిమా టిక్కెట్ రేట్ల వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలతో కమిటీ వేశామని.. త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. పెట్టిన పెట్టుబడులు వారం రోజుల్లో రాబట్టుకోవాలని సినీ నిర్మాతలు చూస్తున్నారని సజ్జల విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై రామ్ గోపాల్ వర్మ చేస్తున్న విమర్శలపైనా సజ్జల స్పందించారు. ఆయన చేస్తున్న కామెంట్లు కార్టూన్లు వేసుకోవడానికి పని కొస్తాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు
సినిమా టిక్కెట్ల అంశం కొద్ది రోజులుగా దుమారం రేపుతోంది. టిక్కెట్ రేట్ల తగ్గింపుపై ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించారు. పేదలకు వినోదం అందుబాటులోకి తెస్తున్నామని.. అయినా కొంతమంది విమర్శిస్తున్నారని అన్నారు. ఈ అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డి వీలైనంత చిన్న అంశంగా చెప్పడానికి ప్రయత్నించడం ఆసక్తి రేపుతోంది. ఇంక వివాదం ముదరదని.. సమసిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ నిర్వహణలో అత్యంత కీలకంగా ఉండే సజ్జల ఈ కామెంట్లు చేయడంతో ఏదో ఓ పరిష్కారం వ్సతుందని అంచనా వేస్తున్నారు.
Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి