‘ప్రేమమ్’కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మలయాళంలో ఈ సినిమా కల్ట్ హిట్ స్టేటస్ దక్కించుకుంది. పలు భాషల్లో రీమేక్ అయ్యింది. తెలుగులో ఈ సినిమాను అక్కినేని నాగచైతన్య రీమేక్ చేశారు. అందులో శ్రుతీ హాసన్, అనుపమా పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. శృతి తప్ప మిగతా ఇద్దరు మలయాళంలో నటించారు. శ్రుతీ హాసన్ పోషించిన పాత్రను మాతృకలో సాయి పల్లవి చేశారు. ఆ పాత్ర ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. 'ప్రేమమ్'తో స్టార్ అయ్యింది. ఇప్పుడీ 'ప్రేమమ్' ప్రస్తావన ఎందుకంటే...



తెలుగు 'ప్రేమమ్'లో హీరో నాగచైతన్య, మలయాళ 'ప్రేమమ్'లో హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా 'లవ్ స్టోరి'. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు కూడా బాగా వచ్చాయి. ఇప్పుడీ సినిమాను మలయాళంలో విడుదల చేస్తున్నారు. 'ప్రేమ తీరం' పేరుతో 'లవ్ స్టోరి'ని మలయాళంలో డబ్బింగ్ చేశారు. ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం మలయాళం ట్రైలర్  విడుదల చేశారు. అక్కడి ప్రేక్షకుల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి.



మలయాళంలో సాయి పల్లవికి చాలామంది అభిమానులు ఉన్నారు. అక్కడ చాలా సినిమాలు కూడా చేశారు. దాంతో ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు సాంగ్స్ ఆల్రెడీ హిట్ కావడం ప్లస్ పాయింట్. ఈ సినిమా హిట్ అయితే రాబోయే కాలంలో నాగచైతన్య తన సినిమాలను మలయాళంలో డబ్బింగ్ చేసి విడుదల చేసుకోవచ్చు. అక్కడి మార్కెట్ కూడా పెరుగుతుంది. విచిత్రం ఏంటంటే... తెలుగునాట థియేటర్లలో విడుదలైన 'లవ్ స్టోరి' ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ నెల 22 నుంచి 'ఆహా' ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. తెలుగు తెలిసిన మలయాళీలు ఉంటే ఓటీటీలో సినిమా చూసే అవకాశాలు లేకపోలేదు.