2022 సంక్రాంతిపై చాలా సినిమాలు కన్నేశాయి. ముందుగా పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్', మహేష్ బాబు 'సర్కారు వారి పాట', ప్రభాస్ 'రాధేశ్యామ్', 'ఎఫ్3', 'బంగార్రాజు' ఇలా ఒకటా రెండా..? చాలా సినిమాలు సంక్రాంతికి రావాలనుకున్నాయి. కొన్ని సినిమాలు అఫీషియల్ గా రిలీజ్ డేట్లను కూడా అనౌన్స్ చేశాయి. కానీ ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమా జనవరి 7న విడుదల కాబోతున్నట్లు ప్రకటించడంతో.. ఒక్క 'రాధేశ్యామ్' తప్ప మిగిలిన అన్ని సినిమాలు రిలీజ్ డేట్ ను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. 

 

ఇప్పటికే 'ఆచార్య' సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. అనీల్ రావిపూడి-విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ 'ఎఫ్3'కి కూడా డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 25న ఆ సినిమా విడుదలవుతుంది. అంటే సంక్రాంతి బరిలో నుంచి ఈ సినిమా తప్పుకున్నట్లే. ఇక 'భీమ్లా నాయక్', 'సర్కారు వారి పాట' సినిమాల డేట్స్ రావాల్సివుంది. 

 


 

మహేష్ బాబు-పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి మహేష్ ని థియేటర్లో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు మహేష్ సినిమా సంక్రాంతికి రావడం లేదని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 

 

ఇక పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'భీమ్లా నాయక్' సినిమా కొత్త డేట్ ను కూడా అనౌన్స్ చేయాలని చూస్తున్నారు. మార్చి 31న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. నిజానికి పవన్ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని షూటింగ్ విషయంలో కూడా కాస్త జోరు ప్రదర్శించారు. కానీ ఊహించని విధంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా జనవరిలో విడుదలవుతుండటంతో పవన్ సినిమా కూడా వాయిదా వేసుకోక తప్పడం లేదు. కాదని ముందుకొస్తే.. అది కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అందరూ వెనక్కి తగ్గుతున్నారు. 

 

2021 డిసెంబర్ నుంచి వరుసగా జనవరి, ఫిబ్రవరి, మర్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్కో పెద్ద సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఇక సమ్మర్ లో అయితే వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదల కాబోతున్నాయి. 

 


 


 


 


 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి