సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును బహూకరించబోతున్నట్లు ప్రకటించింది. దాదాపు నలభై ఏళ్లకు పైగా ఆయన సినీ రంగానికి సేవలు చేస్తున్నారు. 2019 ఏడాదికి గానూ ఆయన ఈ అవార్డును అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా కోలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు చెప్పారు. 


దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడం తనకెంతో సంతోషాన్నిస్తుందని.. ఆ అవార్డు తనకు వస్తుందని ఎన్నడూ అనుకోలేదని చెప్పారు. ఇలాంటి సమయంలో తన గురువు కె.బాలచందర్‌ లేకపోవడం ఎంతో బాధగా ఉందని ఎమోషనల్ అయ్యారు. 2010లో కె.బాల‌చందర్‌ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 


Also Read: టీజ‌ర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?


అనంతరం రజినీకాంత్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రేపు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని అన్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకోవడంతోపాటు తన కుమార్తె సౌందర్య విఘ్నేశ్‌ ఎంతో శ్రమించి సిద్ధం చేసిన 'హూట్‌ యాప్‌'ని తాను విడుదల చేయనున్నట్లు రజనీ తెలిపారు. 


ఇప్పటివరకు రజినీకాంత్ 168 చిత్రాల్లో నటించారు. 168వ చిత్రంగా 'అన్నాత్తే'ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ మాస్ లుక్ ఆడియన్స్ ను మెప్పించింది. ఇదే సినిమాను తెలుగులో 'పెద్దన్న' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. రీసెంట్ గానే సినిమా టీజర్ ను విడుదల చేశారు. నవంబర్ 4న దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 


ఇక సినిమా ఇండస్ట్రీలో 1969 నుంచి ఈ అవార్డుని అందిస్తున్నారు. ల‌తా మంగేష్క‌ర్‌, అక్కినేని నాగేశ్వరరావు, దిలీప్ కుమార్‌, రాజ్ కుమార్‌, శివాజీ గ‌ణేశ‌న్‌, ఆశా భోస్లే, యష్ చోప్రా, వినోద్ ఖ‌న్నా, అమితాబ్ బ‌చ్చ‌న్‌ లాంటి వారిని ఈ అవార్డు వరించింది. ఇప్పుడు రజినీకాంత్ కు ఈ అవార్డ్ ఇవ్వబోతున్నారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రజనీకాంత్‌ ఈ అవార్డును అందుకోనున్నారు.