తెలుగు సినిమా నిర్మాతలకు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులకు థియేటర్లకు వస్తారో? రారో?  వసూళ్లు వస్తాయో? రావో? వంటి సందేహాలకు సమాధానం లభించింది. కంటెంట్ బావున్న చిత్రాలకు ప్రేక్షకులు వస్తున్నారు. దాంతో ధైర్యంగా కొత్త చిత్రాలను విడుదల చేయడానికి హీరోలు, దర్శక -నిర్మాతలు ముందుకొస్తున్నారు. విజయ దశమికి 'మహా సముద్రం', 'పెళ్లి సందడి', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటి వరకూ విడుదలైన చిత్రాల్లో 'లవ్ స్టోరి', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌', 'వరుణ్ డాక్టర్' హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో లో బడ్జెట్, డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం దాదాపు అరడజను చిత్రాలు వస్తున్నాయి. అవేంటో మీరూ చూడండి.


 

నింగి... నేల... ఎలా కలిశాయి? 



సినిమా: 'వరుడు కావలెను'

హీరో: నాగశౌర్య

హీరోయిన్: రీతూ వర్మ

 

అనగనగా ఓ అమ్మాయి. ఆమె పేరు భూమి. పొగరు ఎక్కువ. పెళ్లి చూపులు అంటే పడదు. విదేశాల నుండి ఇండియాకు వచ్చిన అబ్బాయి ఆకాశ్. భూమిని ఇష్టపడతాడు. ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. భూమికి సమస్యలు వస్తే పరిష్కరిస్తాడు. 'నా పేరు తెలుసా? ఆకాశ్! భూమికి అన్ని వైపులా నేనే ఉంటా' అని విలన్లకు వార్నింగ్ కూడా ఇస్తాడు. అయితే, 'భూమి... ఆకాశం... ఎదురెదురుగా ఉన్నా ఎప్పటికీ కలవలేవు' అని భూమి చెబుతుంది. మరి, ఈ నింగి... నేల... ఎలా కలిశాయి? అన్నది 'వరుడు కావలెను' సినిమా పాయింట్. ఆకాశ్ పాత్రలో నాగశౌర్య, భూమిగా రీతూ వర్మ నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థకు చెందిన అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రమిది.

 

ముద్దులు... హగ్గులు... రొమాంటిక్ ట‌చ్‌లు!



సినిమా: 'రొమాంటిక్'

హీరో: ఆకాశ్ పూరి

హీరోయిన్: కేతికా శర్మ


 

'పట్టుకోవడం అంటే ఏంటి? ముద్దు పెట్టుకోవడమా!? కౌగిలించుకోవడమా!? చెయ్యి పట్టుకుని లాగడమా!?' - కేతికా శర్మకు రమ్యకృష్ణ ప్రశ్న. 'ఇవన్నీ కలిపితే... దాన్ని పట్టుకోవడం అంటారు' - కేతికా శర్మ సమాధానం. ఈ సంభాషణ చాలు... 'రొమాంటిక్' సినిమా మీద ఓ క్లారిటీ రావడానికి! ట్రైలర్ చూస్తే... మరింత క్లారిటీ వస్తుంది. అందులో పూరి జగన్నాథ్ మార్క్ డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయి. కుమారుడు ఆకాశ్ పూరికి హిట్ ఇవ్వడం కోసం ఈ సినిమాకు ఆయన కథ, కథనం, సంభాషణలు రాశారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు. అనిల్ పాడూరి దర్శకత్వం వహించినా...ట్రైలర్ చూస్తే పూరి జగన్నాథ్ మార్క్ కనపడుతోంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే విధంగా సినిమా తీసినట్టు ఉన్నారు. ఇదీ అక్టోబర్ 29న విడుదలవుతోంది. ముందు ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. కానీ, ముందుకు వచ్చారు. 

 

 

రెండు డబ్బింగ్ సినిమాలు... మూడు చిన్న చిత్రాలు!


'కె.జి.యఫ్' విజయం తర్వాత కన్నడ హీరోలు తెలుగు మార్కెట్ మీద కన్నేశారు. ప్రతి సినిమాను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ లిస్టులో శివ రాజ్‌కుమార్‌ చేరారు. ఆయన హీరోగా నటించిన కన్నడ సినిమా 'భజరంగి 2'. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'జై భజరంగి'గా తీసుకొస్తున్నారు. కన్నడతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 29న విడుదల కానుంది. ఇందులో భావన హీరోయిన్. తెలుగులో శ్రీకాంత్ 'మహాత్మ', గోపీచంద్ 'ఒంటరి', నితిన్ 'హీరో'లో ఆమె నటించారు. 


 



కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా, తమిళ నటుడు ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'చార్లీ చాప్లిన్ 2'. తమిళనాడులో 2019 జనవరిలో విడుదలైంది. తెలుగు డబ్బింగ్ 'మిస్టర్ ప్రేమికుడు' ఈ వారం మన ముందుకు వస్తోంది. ఇందులో నిక్కీ గల్రాని, అదా శర్మ హీరోయిన్లు. 


స్ట్రయిట్ తెలుగు సినిమాలకు వస్తే... నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మిషన్ 2020'తో పాటు 'తీరం', 'ఓ మధు' వంటి చిన్న చిత్రాలు ఈ నెల 29న విడుదల కానున్నాయి. అక్టోబర్ 29న అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలోకి వస్తున్నా... కాంపిటీషన్ 'వరుడు కావలెను', 'రొమాంటిక్' సినిమాల మధ్యే ఉంది. 'వరుడు కావలెను' ఫ్యామిలీ అండ్ క్లాస్ ఆడియ‌న్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమా. 'రొమాంటిక్' పక్కా యూత్, మాస్ ఆడియ‌న్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమా.