ఓ వైపు 'ఆచార్య' వంటి భారీ చిత్రాలను నిర్మిస్తూనే... మరోవైపు కంటెంట్ ఉన్న కథలతో, యంగ్ టాలెంట్‌తో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. శ్రీ విష్ణు హీరోగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సినిమా సినిమా 'అర్జున ఫల్గుణ'. ప్రేక్షకులతో పాటు విమర్శకులను ఆకట్టుకున్న 'జోహార్' సినిమా తెరకెక్కించిన తేజ మార్ని ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో అమృతా అయ్యర్ కథానాయిక. ఇటీవల టీజర్ విడుదల చేశారు. తాజాగా తొలి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇది అచ్చమైన పల్లె పాటలా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.
'అర్జున ఫల్గుణ' చిత్రంలో 'గోదారి వాళ్లే సందమామ... భలేటొళ్లులే సందమామ' అంటూ సాగిన ఈ గీతానికి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. గోదావరి జిల్లాల్లో ప్రజల మనస్తత్వాలను పాటు అక్కడి పల్లె వాతావరనాన్ని పాటలో ఆవిష్కరించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ చక్కటి బాణీ అందించగా... అమల చేబోలు, అరవింద్ ఆలపించారు. ఈ పాటలో శ్రీ విష్ణు, అమృత అయ్యర్ మధ్య కెమిస్ట్రీ బావుందని చెప్పాలి. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, 'రంగస్థలం' మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు నటించారు.