మణిపూర్‌లో  అస్సాం రైఫిల్స్‌ జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యం చేసుకుని.. ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కమాండింగ్‌ అధికారి, ఆయన కుటుంబసభ్యులు సహా పలువురు జవాన్లు చనిపోయారు. మయన్మార్‌ సరిహద్దుకు సమీపంలోని చురాచంద్‌ జిల్లా సింఘత్‌లో ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.



అస్సాం రైఫిల్స్‌ కాన్వాయ్‌ వెళ్తుండగా.. కొందరు ముష్కరులు కాల్పులు, బాంబు దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో అస్సాం రైఫిల్స్‌ కమాండింగ్‌ అధికారి విప్లవ్‌దేవ్‌ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు నలుగురు జవాన్లు చనిపోయారు. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పారామిలిటరీ సిబ్బంది, రాష్ట్ర బలగాలు ముష్కరుల కోసం గాలిస్తున్నాయి.  విప్లవ్‌దేవ్‌ సెలవు ముగించుకుని తిరిగి యూనిట్‌లో చేరేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు  సమాచారం. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.