Actress Bhagyashree Is A Princess By Birth: డెబ్యూ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హీరోయిన్ పుట్టుకతోనే యువరాణి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఆమె తీసుకున్న ఓ నిర్ణయం, భర్త వల్ల నాశనం చేసుకున్నారు. దీంతో చిన్న వయసులోనే సినిమాలకు గుడ్ బై చెప్పి, పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ చేశారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరోసారి కెరీర్ పుంజుకోవడంతో ప్రభాస్ సినిమాలో సైతం నటించింది. తాజాగా గాయాల వల్ల మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ హీరోయిన్ ఎవరంటే సీనియర్ నటి భాగ్యశ్రీ.
ఒక్క మూవీతోనే ఓవర్ నైట్ స్టార్
భాగ్యశ్రీ మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హీరోయిన్‌గా మారారు. 1989లో రిలీజ్ అయిన హిందీ మూవీ 'మైనే ప్యార్ కియా'. ఈ మూవీతోనే భాగ్యశ్రీ హిందీ చిత్ర సీమలోకి అడుగు పెట్టారు. భాగ్యశ్రీతో పాటు ఇందులో హీరోగా నటించిన సల్మాన్ ఖాన్‌కు కూడా ఈ సినిమానే లైఫ్ ఇచ్చింది. హీరో హీరోయిన్లు ఇద్దరూ ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించడమే కాకుండా, భాగ్యశ్రీ ఈ మూవీకి గాను 'బెస్ట్ ఫిమేల్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్' అవార్డును అందుకున్నారు. నిజానికి అప్పటికే ఇండస్ట్రీలో అమితాబ్ బచ్చన్, హేమమాలిని, రేఖ, వినోద్ ఖన్నా వంటి స్టార్ హీరోలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కానీ 1980లో చివర్లో వీరంతా డీలాపడ్డారు. వరుస డిజాస్టర్లు పడడంతో ఈ మార్పు ఇండస్ట్రీలో కొత్తముఖాల అవసరాన్ని క్రియేట్ చేసింది.
ఫలితంగా 1989లో అవసరాన్ని తీర్చే ఇద్దరు కొత్త హీరో హీరోయిన్లు సల్మాన్, భాగ్యశ్రీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, స్టార్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ మూవీ ఇచ్చిన బూస్ట్‌తో సల్మాన్ ఖాన్‌కు వరుసగా ఆఫర్లు రావడంతో స్టార్ హీరో స్టేటస్‌కి చేరుకున్నారు. కానీ భాగ్యశ్రీ మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 1990లో ఆమె హిమాలయ దస్సానిని వివాహం చేసుకోగా.. ఆ తర్వాత ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. అలాగే ఆమె కెరీర్ నాశనం కావడానికి కూడా పెళ్లి తర్వాత భాగ్యశ్రీ తీసుకున్న నిర్ణయం కారణమైంది.
పెళ్లి తరువాత షాకింగ్ నిర్ణయం
పెళ్లయ్యాక భాగ్యశ్రీ తన భర్తతో తప్ప వేరే హీరోలతో కలిసి పని చేయనని ప్రకటించారు. అలా భర్తతో కలిసి ఆమె చేసిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఫలితంగా 24 ఏళ్ల చిన్న వయసులోనే భాగ్యశ్రీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు. ఇక ఈ అమ్మడు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. 1997లో 'ఓంకారం' అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది భాగ్యశ్రీ. ఈ మూవీకి ఉపేంద్ర దర్శకుడు. తెలుగులో ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 2021లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. 'తలైవి' సినిమాలో ఆమె జయలలిత తల్లిగా తెరపై కనిపించారు. 2022లో ప్రభాస్ తల్లిగా 'రాధేశ్యామ్' మూవీలో నటించడంతో భాగ్యశ్రీ కెరీర్ ఊపందుకుంది. అప్పట్లో ప్రభాస్ తల్లి ఎవరు ? అని గూగుల్లో తెగ సెర్చ్ చేశారు. 2023లో భాగ్యశ్రీ ఏకంగా నాలుగు సినిమాల్లో కీలకపాత్రను పోషించారు. చివరగా ఆమె 'లైఫ్ హిల్ గయు' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. తాజాగా పికిల్ బాల్ గేమ్ ఆడుతూ గాయాల పాలై వార్తల్లో నిలిచారు.
పుట్టుకతోనే యువరాణి
ఇక హీరోయిన్లలో భాగ్యశ్రీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే పుట్టుకతోనే ఆమె ఒక యువరాణి. ఆమె సాంగ్లి రాచరిక రాష్ట్రాన్ని పాలించిన చివరి రాజు చింతమన్‌రావ్ ధుండిరావు పట్వర్ధన్ మనవరాలు. ఆమె తండ్రి విజయ్ సింఘరావు మాధవరావు పట్వర్ధన్‌కు సాంగ్లి రాజా అనే బిరుదు కూడా ఉంది. అలా భాగ్యశ్రీ పుట్టుకతోనే యువరాణిగా మారారు.