'కేజిఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో యష్. ఆయన హీరోగా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'టాక్సిక్'. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ మూవీకి వర్క్ చేస్తున్న హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ పెర్రీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో మూవీ ఎలా ఉంది అన్న విషయాన్ని ఆయన వెల్లడించారు.
టాక్సిక్ మూవీపై ఫస్ట్ రివ్యూ
యష్ - గీతూ మోహన్ దాస్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ 'టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్ప్స్'. ఈ సినిమాకు సంబంధించిన పనిని ఇటీవలే పూర్తి చేసినట్టు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రి తాజాగా ఇంస్టాగ్రామ్ లో ప్రకటించారు. యష్ ను స్నేహితుడిగా సంబోధిస్తూ, ఆయనతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందంటూ ఒక నోట్ ను రాశారు. 'టాక్సిక్' సెట్స్ నుంచి యష్ తో కలిసి దిగిన ఓ పిక్ ను పంచుకుంటూ జెజె పెర్రి "నా స్నేహితుడు యష్ తో టాక్సిక్ సినిమాలో పని చేయడం ఆనందంగా ఉంది. యూరప్ నుంచి చాలా మంది ఫ్రెండ్స్ తో కలిసి ఈ మూవీ కోసం వర్క్ చేశాను. భారతదేశంలో ఈ మూవీకి పని చేయడం సంతోషంగా ఉంది. ఈ మూవీని ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆతృతగా ఉంది.. ఇట్స్ ఏ బ్యాంగర్... నేను చేసిన పనికి గర్వపడుతున్నాను" అంటూ పోస్ట్ చేశారు.
పెర్రీ పోస్ట్ కు యష్ రియాక్షన్
జెజె పెర్రి పోస్ట్ చేసిన వెంటనే, దానికి యష్ కూడా రియాక్ట్ అయ్యారు. "మై డియర్ ఫ్రెండ్... మీతో కలిసి పని చేయడం చాలా సులభం. రా పవర్" అని కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా, 'టాక్సిక్' మూవీని కన్నడతో పాటు ఇంగ్లీషులో కూడా ఒకేసారి నిర్మిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా ఈ మూవీని భారతీయ, అంతర్జాతీయ భాషలలో డబ్బింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ద్విభాష ప్రాజెక్ట్ కాబట్టి నిర్మాణానికి ఎక్కువ టైం పడుతుంది అని సమాచారం. ఐరన్ మ్యాన్, జాన్ విక్ లాంటి పాపులర్ హాలీవుడ్ సినిమాలకు పని చేసిన హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ 'టాక్సిక్' కోసం ఇంటెన్స్ యాక్షన్స్ సీన్స్ ను రూపొందించారు. ఈ మూవీ ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ కోసం గ్లోబల్ స్టూడియోతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను నిర్మాతలు ఇంకా సస్పెన్స్ గానే ఉంచుతున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయనతార కూడా ప్రధాన పాత్రలను పోషిస్తున్న సంగతి తెలిసిందే.