జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) సినిమా విడుదల విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మార్చి నెలాఖరున సినిమా థియేటర్లలోకి రావడం లేదు. ఇవాళ కొత్త విడుదల తేదీ ప్రకటించారు.
మార్చి నుంచి మే నెలకు వెళ్లిన వీరమల్లు!
Hari Hara Veera Mallu New Release Date: 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని తొలుత ఈ నెల 28న థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేశారు. ఇప్పుడు మే నెలలకు వెళ్లారు. మే 9వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు హోలీతో పాటు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనౌన్స్ చేశారు.
కొత్త విడుదల తేదీ వెల్లడించిన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే... పవన్ కళ్యాణ్ గుర్రం మీద సవారి చేస్తూ కనిపించారు. ఆ వెనుక హీరోయిన్ నిధి అగర్వాల్, సినిమాలో కీలక పాత్రలు చేసిన సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు ఉన్నారు.
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకం మీద ఎ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయనకు ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం అయింది.
నితిన్, నాగవంశీ సినిమాలకు లైన్ క్లియర్!
పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా వాయిదా పడడంతో ఆయన వీరాభిమాని నితిన్ హీరోగా నటించిన, నాగవంశీ నిర్మించిన సినిమాలకు లైన్ క్లియర్ అయ్యింది. మార్చి 28న విడుదల అయ్య సినిమాల ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తారని చెప్పవచ్చు.
మార్చి 28న 'మ్యాడ్ స్క్వేర్' సినిమా విడుదల తేదీని వెల్లడించిన సమయంలో... 'పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అదే తేదీకి వస్తుంది కదా?' అని నిర్మాత సూర్యదేవర నాగవంశీని ప్రశ్నించగా, ''పవన్ గారి సినిమా వస్తే మా సినిమా వాయిదా వేస్తాం' అని చెప్పారు. ఇప్పుడు ఆ సినిమాను వాయిదా వేయాల్సిన అవసరం లేదు.
నితిన్ హీరోగా నటించిన 'రాబిన్ హుడ్' సినిమాను మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. గత ఏడాది 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాతో ఆయన ఒక ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నారు. అందులో హీరోయిన్ శ్రీ లీలతో కలిసి 'రాబిన్ హుడ్' చేశారు. ఈ సినిమా విజయం మీద ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. పవన్ సినిమా రాదనే ధీమాతో ఆయన విడుదల తేదీ వెల్లడించారు. మార్చి 28న హరిహర వీరమల్లు విడుదల కావడం కష్టమని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముందు నుంచి వినబడుతోంది. అదే నిజమని ఈ రోజు అనౌన్స్ చేసిన విడుదల తేదీ వల్ల క్లారిటీ వచ్చింది.