Imran Khan Come Back Film: బాలీవుడ్ సీనియర్ నటుడు ఇమ్రాన్ ఖాన్ రీఎంట్రీ గురించి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం మొదలు పెట్టాక, ఇమ్రాన్ ఖాన్ రీఎంట్రీ గురించి వార్తలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులు 'లౌట్ ఆవో ఇమ్రాన్ ఖాన్' వంటి హ్యాష్ ట్యాగ్ లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అలా ఇమ్రాన్ ఖాన్ రీఎంట్రీ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్న చాలా మంది అభిమానుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడబోతోంది అనేది తాజా సమాచారం. భూమి పెడ్నేకర్ హీరోయిన్‌గా ఇమ్రాన్ ఖాన్ మూవీ ఒకటి షూటింగ్ జరుపుకుంటోందని తెలుస్తోంది.
ఇమ్రాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ డీటైల్స్
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇమ్రాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రం షూటింగ్ 2025 ఏప్రిల్‌లో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇమ్రాన్‌తో పాటు ప్రధాన పాత్ర కోసం భూమి పెడ్నేకర్‌ను మేకర్స్ లాక్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. నెల రోజుల్లో షూటింగ్ మొదలు కానుంది. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక 2024 సెప్టెంబర్‌లోనే ఈ మూవీకి స్క్రిప్ట్‌ను డానిష్ అస్లాం రాశారని, సినిమాను ఇమ్రాన్‌తో పాటు ఆయన స్నేహితుడు నిర్మించే అవకాశం ఉందని రూమర్లు వచ్చాయి.
అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్‌ను తన కొత్త ప్రాజెక్ట్ గురించి అడిగారు. దానికి ఆయన స్పందిస్తూ "నేను ఇప్పుడు దాని గురించి ఎక్కువగా మాట్లాడలేను. ఈ పప్రాజెక్ట్ గురించి ఇప్పటికే వార్తా పత్రికలలో కూడా కొన్ని విషయాలు వచ్చాయి. వాటిలో కొంత నిజం, కొంత నిజం కాదు. ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉంది. కాబట్టి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మేము చాలా సంతోషంగా ఈ మూవీ డీటైల్స్ ను ప్రకటిస్తాము" అంటూ చెప్పుకొచ్చారు. అంతేతప్ప ఇమ్రాన్ ఖాన్ ఈ మూవీ గురించి అంతకుమించి ఒక్క డీటైల్ కూడా వెల్లడించలేదు. కానీ ఇప్పుడు హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యిందని, షూటింగ్ త్వరలోనే షురూ కానుందనే అప్డేట్ రావడంతో ఇమ్రాన్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ చివరి సినిమా, విడాకులు
ఇమ్రాన్ ఖాన్ తెరపై కన్పించి దాదాపు దశాబ్దం అవుతోంది. చివరగా 2015లో కంగనా రనౌత్ తో కలిసి 'కత్తి బట్టి' అనే సినిమా చేశారు ఇమ్రాన్. ఆ సినిమా తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఇండస్ట్రీలో చురుకుగా లేరు. అనుపమ చోప్రాతో గతంలో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత సమస్యలు, మానసిక ఆరోగ్యం వంటి కారణాల వల్ల ఇంతకాలం లైమ్ లైట్ కు దూరంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. అలా ఇమ్రాన్ ఖాన్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమయంలోనే ఆయన భార్య అవంతిక మాలిక్ తో విడాకులు తీసుకున్నారు.