Akhil's Agent Movie OTT Streaming On SonyLIV: యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'ఏజెంట్' (Agent). థియేటర్లలో రిలీజ్ అయిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
'సోనీలివ్'లో చూసి ఎంజాయ్ చెయ్యండి..
'ఏజెంట్' మూవీ ప్రముఖ ఓటీటీ 'సోనీలివ్'లో (SonyLIV) స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. 2023, ఏప్రిల్ 28న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా.. అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పరంగా జరిగిన వివాదాలతో ఓటీటీ విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు అవన్నీ సమసిపోయి దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించగా.. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించారు. ఆమెకు ఇది ఫస్ట్ మూవీ కాగా.. అనంతరం వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' సినిమాలో నటించి మెప్పించారు. మూవీలో డినో మోరియా, విక్రమ్‌జిత్ వ్రిక్, సంపత్ రాజ్, ఊర్వశి రౌటేలా కీలక పాత్రలు పోషించారు. 'ఏజెంట్' సినిమాకు వక్కంతం వంశీ కథ అందించగా.. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి భార్య దీప నిర్మాతగా సురేందర్ టు సినిమా సంస్థల మీద ఈ సినిమా రూపొందింది. అయితే, ఏజెంట్ తర్వాత అఖిల్ మరో సినిమా చేయలేదు. ఆయన కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'ఏజెంట్' స్టోరీ ఏంటంటే..?
అఖిల్ మాస్ హీరోగా ఎంటర్‌టైన్ చేసిన 'ఏజెంట్' మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు రామకృష్ణ (అఖిల్) స్రై అవ్వడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇందుకోసం 'RAW' (రా)లో చేరేందుకు పరీక్షలు రాస్తుంటాడు. అయితే, ప్రతీసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతుంటాడు. దీంతో ఎథికల్ హ్యాకింగ్ ద్వారా ఏకంగా 'రా' చీఫ్ మహాదేవ్ (మమ్ముట్టి) సిస్టమ్‌ను హ్యాక్ చేసి.. అతని దృష్టిలో పడాలని భావిస్తాడు. కానీ.. రామకృష్ణ తింగరి వేషాలతో ఆయన కూడా రిజెక్ట్ చేస్తాడు. మరోవైపు, మిషన్ రాబిట్ పేరుతో ఇండియాపై చైనాతో కలిసి కుట్ర పన్నుతాడు ధర్మ (డినో మోరియా).
వీరి కుట్రను భగ్నం చేయాలనే మహాదేవ్ తన ఏజెంట్‌తో ఓసారి ఫెయిల్ అవుతాడు. అయితే, అనూహ్యంగా ఇదే విషయమై రామకృష్ణను రంగంలోకి దించుతాడు మహాదేవ్. అసలు రిజెక్ట్ చేసిన వ్యక్తిని మహాదేవ్ మళ్లీ ఎందుకు రంగంలోకి దించాడు.?, అసలు రామకృష్ణ స్పైగా ఎందుకు మారాలనుకున్నాడు.?, వైద్యతో అతని ప్రేమాయణం.. అసలు మిషన్ రాబిట్‌ను ఎలా అడ్డుకున్నారు.. వంటి విషయాలు తెలియాలంటే 'ఏజెంట్' మూవీ చూడాల్సిందే.