Aishwarya Rajesh's Driver Jamuna Movie OTT Streaming On Amazon Prime: క్రైమ్, హారర్ థ్రిల్లర్స్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో అలాంటి కంటెంట్‌నే ఓటీటీలు ఎక్కువగా అందుబాటులోకి తెస్తున్నాయి. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) లీడ్ రోల్‌లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'డ్రైవర్ జమున' (Driver Jamuna). ఈ మూవీ దాదాపు మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే తమిళం, తెలుగులో 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతుండగా మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది.
ఆ ఓటీటీలో స్ట్రీమింగ్..
'డ్రైవర్ జమున' మూవీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ (Amazon Prime Video) అందుబాటులోకి వచ్చింది. అయితే, కేవలం తమిళంలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి కిన్ స్లిన్ దర్శకత్వం వహించగా.. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఐశ్వర్య రాజేష్‌తో పాటు నరేన్ కీలక పాత్ర పోషించారు. జమున అనే యువతి తండ్రి హత్యకు గురి కాగా.. తల్లి అనారోగ్యం పాలవుతుంది. దీంతో తన తండ్రి క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది.
అయితే, తన తండ్రిని చంపిన ముగ్గురు ఓ రోజు ఆమె క్యాబ్ ఎక్కుతారు. ప్రజల్లో మంచి పేరున్న ఓ మాజీ ఎమ్మెల్యేను చంపేందుకు వీరు ప్లాన్ చేస్తుండగా.. వీరిని పోలీసులకు పట్టించబోయి ఆమెనే వారికి దొరికిపోతుంది. దీంతో ఆమె వారి నుంచి ఎలా బయటపడింది.?, అసలు ఆ కిల్లర్స్ జమున తండ్రిని ఎందుకు చంపారు.?, మాజీ ఎమ్మెల్యేకు, ఆమె తండ్రికి ఉన్న సంబంధం ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ఇదే ఓటీటీలో మరో సిరీస్
మరోవైపు, ఇదే 'అమెజాన్ ప్రైమ్' వీడియోలో ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్‌లో నటించిన మరో వెబ్ సిరీస్ 'సుళుల్: ది వర్టెక్స్' వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన 'సుళుల్ సీజన్ 2' సైతం గత నెల 28 నుంచి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌లో ఆర్.పార్తీబన్ (R.Parthiban), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), శ్రియా రెడ్డి, కథిర్, హరీష్ ఉత్తమన్, నివేదితా సతీష్, ప్రేమ్ కుమార్ తదితరులు నటించారు. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ సిరీస్ సీజన్ 1కు బ్రహ్మ జి అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు.
సాంబలూరు అనే ఊరిలోని సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులు, యాజమాన్యానికి గొడవ జరుగుతుంది. ఆ కార్మికులకు షణ్ముగం (ఆర్.పార్తీబన్) లీడర్. ఫ్యాక్టరీ ఎండీ త్రిలోక్ (హరీష్ ఉత్తమన్) దగ్గర డబ్బులు తీసుకుని కార్మికులను అణచివేయాలని సీఐ రెజీనా (శ్రియా రెడ్డి) ప్రయత్నిస్తుంది. దీంతో కార్మికులు సమ్మె చేస్తారు. అదే రోజు రాత్రి ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగ్గా.. త్రిలోక్, సీఐ రెజీనా షణ్ముగం మీదే అనుమానం వ్యక్తం చేస్తారు. షణ్ముగాన్ని అరెస్టు చేసేందుకు వెళ్లగా.. అతని చిన్న కుమార్తె అదృశ్యం కావడంతో ఈ 2 కేసులను పోలీసులు విచారిస్తారు. ఈ క్రమంలో వారికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఊరిలో ఆంకాళమ్మ జాతర మయాన్ కొళ్ళాయ్ జరుగుతున్న టైంలో ప్రేమికుల హత్య, ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్, 15 ఏళ్ల క్రితం జాతరలో మరో అమ్మాయి అదృశ్యం కావడం, వీటికి వాటికీ ఉన్న లింకేంటి.? నీలా అక్క నందిని (ఐశ్వర్యా రాజేష్)కి తెలిసిన అసలు నిజం ఏమిటి? అనేది 'సుళుల్' వెబ్ సిరీస్ మెయిన్ కాన్సెప్ట్. తన చెల్లిని చంపిన వారిని చంపి నందిని జైలుకెళ్లగా.. దానికి కొనసాగింపుగా సీజన్ 2 ఉంటుంది.