Kiran Abbavaram's Dilruba Review Rating in Telugu: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం 'క'తో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ దగ్గర రూ. 50 కోట్ల కలెక్షన్లు అందుకున్నారు. ఆ విజయం తర్వాత 'దిల్‌రూబా'తో ఈ రోజు థియేటర్లలోకి వచ్చారు. మరి, ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి.
కథ (Dilruba Movie Story): సిద్ధూ (కిరణ్ అబ్బవరం) తండ్రి, మ్యాగీ అలియాస్ మేఘన (ఖ్యాతి డేవిసన్) తండ్రి స్నేహితులు. తండ్రుల మధ్య స్నేహంతో పాటు పిల్లల మధ్య ప్రేమ పెరిగి పెద్దది అవుతుంది. అయితే... అనుకోని ఘటన వల్ల బ్రేకప్ అవుతుంది. ఆ బాధ నుంచి బయట పడతాడని అబ్బాయిని మంగుళూరు పంపిస్తుంది తల్లి.
మంగుళూరులోని కాలేజీలోని క్లాస్ మేట్ అంజలి (రుక్సార్ థిల్లాన్)తో సిద్ధూ ప్రేమలో పడతాడు. వాళ్లిద్దరి మధ్య ఎందుకు బ్రేకప్ జరిగింది? దానికి కారణం ఎవరు? సిద్ధూతో బ్రేకప్ తర్వాత అమెరికా పెళ్లి చేసుకుని సెటిలైన మ్యాగీ మళ్లీ ఇండియా ఎందుకు వచ్చింది? అంజలితో పాటు మ్యాగీని డ్రగ్, మాఫియా డాన్ జోకర్ (జాన్ విజయ్) ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఎటువంటి పరిస్థితి ఎదురైనా సిద్ధూ థాంక్స్, సారీ చెప్పని సిద్ధూ చివరకు సారీ ఎందుకు చెప్పాడు? అనేది సినిమా.
విశ్లేషణ (Dilruba Review Telugu): స్టోరీ బేస్డ్ తీసే సినిమాలు కొన్ని. క్యారెక్టరైజేషన్ / హీరో యాటిట్యూడ్ బేస్ చేసుకుని తీసే సినిమాలు కొన్ని! ఫర్ ఎగ్జాంపుల్... 'అర్జున్ రెడ్డి'. అందులో కథ లేదని కాదు, హీరో క్యారెక్టరైజేషన్ ఎక్కువ హైలైట్ అయ్యింది. 'దిల్‌రూబా' కూడా అలా క్యారెక్టరైజేషన్ / హీరో యాటిట్యూడ్ బేస్ చేసుకుని తీసిన సినిమా. 'అర్జున్ రెడ్డి'కి, దీనికి డిఫరెన్స్ ఉంది.
థాంక్స్, సారీ... హీరో నోటి వెంట ఈ రెండూ రావు. ఎందుకు? అనేది చెప్పారు. ఓ రీజన్ ఉంది. హీరోకంటూ ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అయితే... దాని చుట్టూ అల్లిన కథలో బలం లేదు. ఓ అమ్మాయితో బ్రేకప్ తర్వాత అమ్మాయిలకు దూరంగా ఉన్న, ఉండాలనుకున్న అబ్బాయి జీవితంలోకి మరో అమ్మాయి రావడం పవన్ కళ్యాణ్ 'జల్సా'లో చూశాం. అందులో హీరోయిన్లు ఇద్దరూ సిస్టర్స్, ఇక్కడ కాదు. రెండు సినిమాల్లో సన్నివేశాలు వేర్వేరు. కానీ, స్టోరీ ఫ్లో ఒక్కటే. హీరో ఫ్లాష్‌బ్యాక్‌లో ఒక పాయింట్ 'మా అన్నయ్య'ను గుర్తు తెస్తే... కొన్ని సీన్లు ఇతర సినిమాలను గుర్తు చేస్తాయి.
'దిల్‌రూబా'లో మంచి మంచి సీన్లు ఉన్నాయ్. హీరో హీరోయిన్స్ పరిచయం నుంచి ప్రేమలో పడటం వరకు బ్యాక్ టు బ్యాక్ యూత్‌ఫుల్ కామెడీ సీన్లతో సినిమాను ముందుకు తీసుకు వెళ్ళారు దర్శకుడు విశ్వ కరుణ్. ప్రేమ కథను మించి హీరోకి మాస్ ఫైట్స్ కంపోజ్ చేయడం ఫ్లోను డిస్టర్బ్ చేసింది. ఉదాహరణకు... ప్రీ ఇంటర్వెల్ ఫైట్. ఆ ఛేజ్ ఎందుకు అనేది అర్థం కాదు. కానీ, అందులో జరిగిన ఒక పాయింట్ హీరో జీవితాన్ని మార్చేస్తుంది. సెకండాఫ్ ప్రెడిక్టబుల్‌గా ఉంది. యాక్షన్ కొరియోగ్రఫీ బావుంది. కానీ, ఈ కథకు ఓవర్ ద టాప్ అనిపిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత కొన్ని ఫైట్స్ కూడా!
టెక్నికల్ టీమ్ నుంచి మంచి అవుట్ పుట్ తీసుకున్నారు దర్శకుడు విశ్వ కరుణ్. హీరో స్టైలింగ్ నుంచి ప్రొడక్షన్ డిజైన్, కెమెరా వర్క్, మ్యూజిక్ వరకు ప్రతి ఒక్క టెక్నీషియన్ న్యాయం చేశారు. శ్యామ్ సిఎస్ పాటలు, యాక్షన్ సీన్లలో ఆర్ఆర్ బావున్నాయి. నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనబడుతోంది.
'క'తో కంపేర్ చేస్తే... కిరణ్ అబ్బవరానికి డిఫరెంట్ క్యారెక్టర్. కాలేజీ కుర్రాడి రోల్ కనుక స్టైల్ మీద బాగా కాన్సంట్రేట్ చేశారు. సెట్ అయ్యింది. యాక్షన్ సీన్స్‌లోనూ స్టైలిష్ కొరియోగ్రఫీ కుదిరింది. నటిగా రుక్సార్ థిల్లాన్ పెద్దగా చేసింది ఏమీ లేదు. న్యూ ఏజ్ అమ్మాయి పాత్రకు తగ్గట్టుగా డ్రెస్సింగ్, యాక్టింగ్ ఉన్నాయి. ఖ్యాతి డేవిసన్ పాత్ర పరిధి మేరకు చేశారు. జాన్ విజయ్ రెగ్యులర్ విలన్ రోల్ చేశారు. ఇటీవల కాలంలో కమెడియన్ సత్యను వాడుకొని చిత్రమిది. అతను ఉన్నా నవ్వించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యారు. విక్కీ పాత్రలో కిల్లి క్రాంతి చక్కగా నటించారు. హీరో తల్లిగా తులసి, రుక్సార్ తండ్రిగా 'ఆడుకాలం' నరేన్, ఇతర పాత్రల్లో వడ్లమాని శ్రీనివాస్, సమీర్, వాసు ఇంటూరి, 'గెటప్' శ్రీను తదితరులు కనిపించారు.
డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ / యాటిట్యూడ్‌తో కూడిన పాత్రతో సినిమా చేయాలని హీరో కిరణ్ అబ్బవరం అనుకోవడం మంచిది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వాలనే ఆయన ప్రయత్నాన్ని అభినందించవచ్చు. కానీ సినిమాను మనస్ఫూర్తిగా అయితే అభినదించలేం. సారీ చెప్పాలి. 'దిల్‌రూబా'తో కిరణ్ అబ్బవరానికి విజయం వస్తుందా? అంటే 'సారీ' చెప్పక తప్పదు. ఆయన స్టైల్, నటనకు మాత్రం మార్క్స్ పడతాయి. అలాగే, టెక్నికల్ టీమ్ పనితనానికి!
PS: సినిమాలో అక్కడక్కడా పూరి జగన్నాథ్ పాడ్‌కాస్ట్‌లలో చెప్పిన మాటలు వినపడతాయి. ఈ సినిమా హీరో క్యారెక్టరైజేషన్ / ఆ యాటిడ్యూడ్ మీద, డైలాగుల్లో పూరి ప్రభావం అడుగడునా కనపడుతుంది. ఆయన ఫ్యాన్స్‌కు నచ్చుతుందేమో!?