Kunchacko Boban's Officer On Duty Review In Telugu: కుంచకో బోబన్ హీరోగా నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'. ఇందులో ప్రియమణి హీరోయిన్. హీరో భార్య పాత్రలో నటించారు. మలయాళంలో ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల చేశారు. తెలుగులో మార్చి 14న విడుదల. మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.
కథ (Officer On Duty Story): హరి శంకర్ (కుంచకో బోబన్) సీఐ. సస్పెన్షన్ తర్వాత డ్యూటీలో చేరిన రోజు గోల్డ్ చైన్ కేసు వస్తుంది. ఆ కేసు విచారణలో భాగంగా ఓ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ కోసం స్టేషన్‌కు రమ్మని చెబితే... ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె ఆత్మహత్యకు, బెంగళూరులోని ఓ పోలీస్ ఆత్మహత్యకు, కేసుకు సంబంధం ఉందని హరి శంకర్ అనుమానిస్తాడు.
తన కుమార్తె మరణానికి హరి శంకర్ కారణం అని అమ్మాయి తండ్రి ఆరోపణలు చేస్తాడు. అసలు నిజం ఏమిటి? విచారణలో హరి శంకర్ ఏం చేశాడు? బెంగళూరు వెళ్లిన తర్వాత అతనిపై హత్యాయత్నం చేసిన గ్యాంగ్ సభ్యులు ఎవరు? వాళ్లకు, ఈ కేసుకు సంబంధం ఏమిటి? హరి శంకర్ నుంచి భార్య గీత (ప్రియమణి) విడాకులు ఎందుకు కోరింది? డ్రగ్స్, న్యూడ్ వీడియోలు తీస్తూ అమ్మాయిలను రేప్ చేయడం ఏమిటి? కేసు ఎక్కడ మొదలైంది? ఎక్కడ ముగిసింది? అనేది సినిమా.
విశ్లేషణ (Officer On Duty Review Telugu): మలయాళ థ్రిల్లర్ సినిమాలకు మన తెలుగు ప్రేక్షకుల్లోనూ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకని ఇంట్రెస్ట్ చూపిస్తారు. తీగ లాగితే డొంక అంతా కదిలినట్టు... ఎక్కడో చిన్న పాయింట్ దగ్గర మొదలు పెట్టి ఎవరూ ఊహించని క్రైమ్ దగ్గరకు తీసుకు వెళ్లడం మలయాళ దర్శక రచయితల శైలి. 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' కూడా ఆ కోవకు చెందిన చిత్రమే.
తాకట్టు పెట్టడానికి వెళ్లిన తన గోల్డ్ చైన్ నకిలీదని చెబుతన్నారని, అసలు చైన్ కొట్టేసి తన చేతిలో రోల్డ్ గోల్డ్ పెట్టారని ఓ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ దగ్గర 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మొదలైంది. చివరకు ప్రతీకారం తీర్చుకోవాలని డ్రగ్ ఎడిక్ట్స్ గ్యాంగ్ కొందరు అమ్మాయిలను ట్రాప్ చేసి, వాళ్లకు డ్రగ్స్ ఇచ్చి రేప్ చేసిన ఘటన దగ్గర ఆగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే కథ ఇదే. రచయిత షాహి కబీర్ - దర్శకుడు జీతూ అష్రఫ్ ఈ కథను ముందుకు తీసుకు వెళ్లిన తీరు బావుంది.
'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' ప్రారంభం నుంచి దర్శకుడు జీతూ అష్రఫ్ ఒక మూడ్‌లోకి తీసుకు వెళతారు. హీరోకు ఒక సమస్య ఉందని ముందు నుంచి చెబుతూ వచ్చి... ఆ సమస్య ఏమిటో రివీల్ చేసిన విధానం బావుంది. ఆ సమస్యకు, కేసుకు భలే ముడి పెట్టారు. దర్శకుడికి సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్, సినిమాటోగ్రాఫర్ రాబీ వర్గీస్ రాజ్ నుంచి విపరీతమైన సపోర్ట్ లభించింది. చాలా సీన్లలో టెన్షన్ బిల్డ్ కావడానికి ప్రధాన కారణం జేక్స్ బీజాయ్ ఆర్ఆర్. తెరపై ఏదో జరుగబోతుందని ఉత్కంఠ కలిగించారు. దాంతో నెక్స్ట్ ఏమిటి? అని చూస్తాం. ఓపెనింగ్ షాట్‌లో కెమెరా మూమెంట్, ఆ లైటింగ్ అద్భుతంగా ఉంది. కెమెరా వర్క్ చాలా సీన్లను ఎలివేట్ చేసింది.
'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమాలో స్క్రీన్ ప్లే బావుంది. అయితే, క్లైమాక్స్‌లో మెయిన్ ప్లాట్ ట్విస్ట్ రివీల్ అయ్యాక అప్పటి వరకు ఉన్న ఇంటెన్స్ డైల్యూట్ అవుతుంది. కొన్ని సీన్లు రొటీన్ అనిపిస్తాయి. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఇంకా చక్కగా ఎలివేట్ చేయాల్సింది. దాన్ని సరిగా డీల్ చేయలేదు. ఇంటెన్స్ డైల్యూట్ కావడానికి అదీ ఓ కారణం.
తెలుగు డబ్బింగ్ అయితే వరస్ట్. వర్ణనాతీతం బదులు వర్ణాతం అంటారు. ఒక పాత్రను చంద్రబాబు అని కాసేపు, చంద్రకాంత్ మరికాసేపు చెప్పారు. టైటిల్స్‌లో 'దుల్కర్ సల్మాన్' బదులు 'దుల్కుర్ సల్మాన్' అని వేశారు. ఇటువంటి మిస్టేక్స్ చాలా ఉన్నాయి. డబ్బింగ్ చేసేటప్పుడు తెలుగు భాషకు గౌరవం ఇస్తే బావుంటుంది.
కుంచకో బోబన్ తన పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశారు. ఇన్వెస్టిగేషన్ కంటే ఎమోషన్స్ చూపించే సీన్స్ చాలా బాగా చేశారు. భార్యగా ప్రియమణి చక్కగా చేశారు. ఇటువంటి రోల్స్ అంటే 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తర్వాత ఆవిడ గుర్తుకు వస్తారేమో. మిగతా నటీనటుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ. ఆఫీసర్ ఆన్ డ్యూటీ... మాంచి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. తెలుగు డబ్బింగ్ సరిగా చేయలేదు. ఆ తప్పును క్షమిస్తే మాంచి థ్రిల్ ఉంటుంది.