2021లో సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు సగం రోజులు థియేటర్లు తెరుచుకోలేదు. తరువాత తెచ్చుకున్నా.. యాభై శాతం ఆక్యుపెన్సీతో నడిపించాల్సి వచ్చింది. మెల్లగా ఆ గండాన్ని దాటుకొని వందశాతం కెపాసిటీతో థియేటర్లు నడిచాయి. అంతా సజావుగా సాగిపోతుందనుకున్న సమయంలో ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ మొదలైంది. ఇంటర్వెల్ లో కొనుక్కునే స్నాక్స్ కంటే సినిమా టికెట్స్ చీప్ గా దొరికేస్తున్నాయి. ప్రభుత్వం విధించిన టికెట్ ధరలతో థియేటర్లను నడపలేమని.. చాలా మంది స్వచ్ఛందంగా థియేటర్లను క్లోజ్ చేస్తున్నారు. 


రూల్స్ కి వ్యతిరేకంగా థియేటర్లను నడుపుతున్నారంటూ ఇంకొన్ని థియేటర్లను ప్రభుత్వమే సీజ్ చేసింది. అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద విడుదలైన సినిమాలు కూడా వరుసగా డిజాస్టర్స్ కావడం ఇండస్ట్రీని కుదిపేసింది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ నెల సినీ పరిశ్రమను ఆదుకుందనే చెప్పాలి. ఈ నెలలో విడుదలైన మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడంతో నిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. 


ముందుగా బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'అఖండ' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. మొదట్లో ఈ సినిమాపై కొన్ని అనుమానాలు ఉండేవి కానీ రిలీజ్ తరువాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. రీసెంట్ గానే ఈ సినిమా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంది. ఇప్పటికీ చాలా థియేటర్లలో ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. ఓవర్సీస్ కూడా ఈ సినిమా సత్తా చాటింది. 


రీసెంట్ గా విడుదలైన 'పుష్ప' సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా.. వసూళ్ల పరంగా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఏపీలో టికెట్ రేట్స్ తగ్గించినా.. 'పుష్ప' మాత్రం బాగానే నిలబడగలిగింది. ఇక శుక్రవారం నాడు విడుదలైన 'శ్యామ్ సింగరాయ్' సినిమాకి కూడా హిట్ టాక్ వచ్చింది. ఏపీలో ఈ సినిమాను టార్గెట్ చేసినా.. మంచి వసూళ్లే రాబట్టింది. నాని కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దానికి తగ్గట్లుగానే వసూళ్లను కూడా రాబడుతోంది. మొత్తానికి ఈ డిసెంబర్ మూడు హిట్స్ తో బాక్సాఫీస్ కళకళలాడుతోంది.  డిసెంబర్ 31న కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి. అప్పుడు కూడా ఏదైనా సినిమా హిట్ అయితే.. 2021కి ఘనంగా వీడ్కోలు పలకొచ్చు.