కొద్ది నెలల క్రితం సినీ హీరో సాయిధరమ్ తేజ్‌కు జరిగిన రోడ్డు ప్రమాదం వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఆయన కోలుకున్న తర్వాత ప్రమాదానికి సంబంధించి నోటీసులు కూడా ఇచ్చామని అన్నారు. 91 సీఆర్పీసీ కింద సాయిధరమ్ తేజ్‌కు నోటీసులు జారీం చేశామని.. లైసెన్స్, బైక్ ఆర్‌సీ, వాహన ఇన్సూరెన్స్, పొల్యూషన్ తదితర పత్రాలన్నీ సమర్పించాల్సిందిగా నోటీసులు పంపినట్లు చెప్పారు. అయితే, ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదని చెప్పారు. ఈ కేసులో త్వరలోనే చార్జ్‌షీట్ దాఖలు చేస్తామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించి వార్షిక నేర నివేదికను స్టీఫెన్ రవీంద్ర విడుదల చేశారు.
ఆస్తులకు సంబంధించి 4.3 శాతం నేరాలు పెరిగాయని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య తగ్గిందని, ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 759 మంది మృతి చెందారని తెలిపారు. వీటిల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 82 శాతం మంది చనిపోయారని చెప్పారు. మొత్తం 712 రోడ్డు ప్రమాదాల్లో మద్యం మత్తు కారణంగా 212 ప్రమాదాలు జరిగాయని వివరించారు. ఫూటుగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్ల నుంచి రూ.4.5 కోట్లు జరిమానాల రూపంలో వసూలైనట్టుగా తెలిపారు. 9,981 మంది వాహనదారుల లైసెన్స్ రద్దు చేశామని వివరించారు.
200 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేశామని అన్నారు. 3 వేలకు పైగా సైబర్ క్రైమ్ కేసులు ఈ ఏడాది నమోదైనట్టు వివరించారు. గతేడాదితో పోల్చితే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని అన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మొత్తం 36 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. 1.6 లక్షల సీసీటీవీ కెమెరాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్నాయని చెప్పారు. 2021లో ఓవరాల్ క్రైమ్ రేట్ 13.24 శాతం పెరిగిందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సైబరాబాద్ పరిధిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
Also Read: Telangana Omicron: తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు... 182 కరోనా కేసులు, ఒకరు మృతి
Also Read: షిర్డీ వెళ్తున్నారా? ఆగండి.. ఆగండి.. దర్శన వేళల్లో మార్పులు చేశారు తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి