కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. దక్షిణాఫ్రికా దేశాల్లో మొదలైన ఈ వేరియంట్ క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. భారత్ లో కూడా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 578 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరిస్తోంది. న్యూ్ వేడుకలకు ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు అమలు చేయాలని మార్గదర్శకాలు జారీచేసింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా కోవిడ్‌ నియంత్రణ చర్యలు జనవరి 31 వరకు పొడిగించింది. న్యూ ఇయర్, పండగ సీజన్ రద్దీని నియంత్రించేందుకు స్థానికంగా ఆంక్షలు, పరిమితులు విధించాలని కేంద్రం  అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. 


ఉత్తర్ ఖండ్ లో ఆంక్షలు 


ఓమిక్రాన్ వేరియంట్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. 


కేరళలో ఆంక్షలు


కేరళ ప్రభుత్వం డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. రాష్ట్రంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పెట్టింది. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల తర్వాత రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. 


దిల్లీలో ఆంక్షలు


దిల్లీలో కోవిడ్‌-19 ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూస్ ఇయర్ సంబరాలపై ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. మాస్కులు తప్పనిసరి చేసింది. మాస్కులు ధరించని వారిని మాల్స్, షాఫింగ్ కాంప్లెక్స్, ఇతర వాణిజ్య ప్రదేశాల్లో అనుమతించవద్దని ఆదేశించింది. కోవిడ్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తేనే పాఠశాలలు, కళాశాలలు నిర్వహించేందుకు అనుమతిస్తామని పేర్కొంది. బార్‌లు, రెస్టారెంట్లలో 50 శాతం సిటింగ్‌ మాత్రమే అనుమతి ఇచ్చింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 200 మంది మించరాదని కఠిన ఆంక్షలు విధించారు. 


ముంబయిలో 144 సెక్షన్‌


మహారాష్ట్రలో ఒమిక్రాన్ పెరుగుతున్నాయి. ముంబయిలో న్యూ ఇయర్‌ వేడుకలకు ప్రభుత్వం నిబంధనలు విధించింది. తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని కోరింది. వేడుకలు, సమావేశాలను 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించుకోవాలని సూచించింది. పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో 200 కన్నా ఎక్కువ మందితో కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే అనుమతి తప్పనిసరి అని తెలిపింది. డిసెంబర్‌ 16 నుంచి 31 వరకు ముంబయిలో అర్ధరాత్రుళ్లు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైన వారిని మాత్రమే ప్రజారవాణాలో ప్రయాణానికి అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. 


హరియాణాలో 


హరియాణాలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ రాత్రిపూట కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. బహిరంగ కార్యక్రమాలకు, వేడుకలకు 200 మంది మించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే వ్యాక్సినేషన్ పూర్తి కాకపోతే బహిరంగ ప్రదేశాలకు అనుమతి ఇవ్వబోమన్నారు. గుజరాత్‌లో నైట్ కర్ఫ్యూ వేళలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. 


యూపీలో 144 సెక్షన్


ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఆంక్షలు విధించింది. నోయిడా, లఖ్‌నవూ జిల్లాల్లో డిసెంబర్‌ 31 వరకు  144 సెక్షన్‌ను అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. 


గుజరాత్‌ నైట్‌ కర్ఫ్యూ


ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న కారణంగా పండగ సీజన్‌లో జనం రద్దీని దృష్టిలో ఉంచుకొని గుజరాత్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని ఎనిమిది నగరాల్లో డిసెంబర్ నెలఖారు వరకూ రాత్రిపూట కర్ఫ్యూను పొడిగించింది. అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, సూరత్‌, రాజ్‌కోట్‌, వడోదర, భవ్‌నగర్‌, జామ్‌నగర్‌, జునాగఢ్‌లలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. నగరాల్లో అర్ధరాత్రి 75శాతం సామర్థ్యంతో, 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. 


కర్ణాటకలో ఆంక్షలు 


న్యూ ఇయర్ వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబర్‌ 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, ఇతర కార్యక్రమాలకు అనుమతిలేదని తెలిపింది. పబ్‌లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లలో డీజేల వినియోగాన్ని నిషేధించింది. కోవిడ్‌, ఒమిక్రాన్‌ వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పబ్‌లలో 50శాతం సామర్థ్యంతో న్యూఇయర్‌ వేడుకలు  జరుపుకోవచ్చు. డీజేలతో పార్టీలు చేసుకునేందుకు అనుమతి లేదన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారిని పబ్‌లు, రెస్టారెంట్లలోకి అనుమతించవద్దని పేర్కొంది. 


తెలంగాణలో ఆంక్షలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. తెలంగాణ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం తెలిపింది.  ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. 


ఒడిశాలో 


ఒడిశాలోనూ డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకూ ఆంక్షలు విధించింది. న్యూ ఇయర్ వేడుకలకు 50 మంది కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. 


యూపీలో 
యూపీలోనూ డిసెంబర్ 25 నుంచి రాత్రి కర్ఫ్యూను అమల్లోకి వచ్చింది. పెళ్లిళ్లకు, వేడుకలకు 200 మంది మాత్రమే హాజరయ్యేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి కావాలి.