PM Modi-JD Vance Meeting: సోమవారం (ఏప్రిల్ 21, 2025) తన నివాసంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా, జనవరిలో వాషింగ్టన్ డిసి పర్యటనను , అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన చర్చలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. జెడి వాన్స్ తన కుటుంబంతో కలిసి 4 రోజులు భారత్‌లో పర్యటించనున్నారు.  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్,  వారి ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్. మిరాబెల్  7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఆతిథ్యం స్వీకరించారు. వాన్స్ కుటుంబం చేరుకున్న వెంటనే, వారు ఉపాధ్యక్షుడిని కౌగిలించుకుని ఉషా వాన్స్‌తో మాట్లాడారు. ఒక వీడియోలో, ప్రధానమంత్రి జెడి వాన్స్ కుమారులతో సరదాగా గడుపుతున్నట్లు కూడా చూడవచ్చు. ఇందులో, వాన్స్ కుటుంబాన్ని ప్రధాని మోదీ వాకింగ్‌కు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.

జెడి వాన్స్ పిల్లలకు ప్రత్యేక బహుమతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌కు ఒక్కొక్కరికి నెమలి ఈకను బహుమతిగా ఇచ్చారు. దీని తర్వాత, ఇద్దరు నాయకుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో సాధించిన పురోగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ స్వాగతించారు. చర్చల తర్వాత, ప్రధాని మోదీ అమెరికా రెండో మహిళ భారత సంతతికి చెందిన ఉష,  ఆమె అధికారుల ప్రతినిధి బృందానికి విందు ఇచ్చారు.

ఈ సమావేశంపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ఇరువురి నాయకుల మధ్య జరిగిన సమావేశం వివిధ రంగాల్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం ,వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్ష జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పారిస్‌లో జరిగిన సమావేశం నుంచి ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని ప్రధానమంత్రి, ఉపాధ్యక్షుడు వాన్స్ సమీక్షించారు. భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో పురోగతిని, ఇంధనం, రక్షణ, వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానాల్లో సహకారాన్ని పెంపొందించే ప్రయత్నాలను నాయకులు స్వాగతించారు. పరస్పర ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం చివర్‌లో ట్రంప్‌ భారతదేశ పర్యటనకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారు అవుతుందా?ఈ సమావేశం తర్వాత ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారతదేశం, అమెరికా తదుపరి దశ చర్చల్లో ఉన్న టైంలో రెండు దేశాల నాయకుల మధ్య సమావేశం జరిగింది. ఇది రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ గతంలో విధించిన 10 శాతం సుంకానికి అదనంగా భారతీయ వస్తువులపై 26 శాతం సుంకాన్ని విధించారు. ప్రస్తుతానికి ఆ సుంకాన్ని 90 రోజుల పాటు వాయిదా వేశారు. ఆర్థికవేత్తలు దీనిని ఇరుపక్షాల మధ్య విన్ అండ్ విన్‌ సిచ్యుయేషన్‌గా చూస్తున్నారు. ఎటువంటి ఒప్పందాలు తొందరపడి చేసుకోబోమని భారత్ స్పష్టం చేసింది. బెదిరింపులకు రాజీ పడమని అలాగనే బలవంతం చేయబోమని తేల్చి చెప్పింది.