Earth Day 2025 : పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పిస్తూ.. భూమిపై ప్రభావం చూపే సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన వరల్డ్ ఎర్త్ డే (World Earth Day) నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సాహిస్తున్నారు. అయితే అసలు దీనిని ఎప్పుడు ప్రారంభించారు. ఈ స్పెషల్ డే వెనుక రీజన్ ఏంటి.. ఈ ఏడాది ఫాలో అయ్యే థీమ్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ఎలా మొదలైందంటే..
వరల్డ్ ఎర్త్ డేని తొలిసారి 1970లో ప్రారంభించారు. 1962లో యూఎస్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ భూమి ప్రమాదంలో ఉందని తెలిపారు. అప్పటి నుంచి ఎర్త్ డేని పాటించాలని కోరారు. ఆ తర్వాత 1969లో జరిగిన జరిగిన oil spill తర్వాత సెనేటర్ గేలార్డ్ నెల్సన్ అమెరికాలో 1970లో ఏప్రిల్ 22వ తేదీన భూమి దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 2 కోట్లమంది అమెరికన్లు పాల్గొనడంతో పర్యావరణ పరిరక్షణకు పలు చట్టాలు, ఏజెన్సీలు మొదలయ్యాయి.
1990 నాటికి ప్రపంచవ్యాప్తంగా 141 దేశాలకు ఈ ఎర్త్ డే విస్తరించింది. దీనిలో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పర్యావరణ పరిరక్షణకు మద్ధతునివ్వడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పలు కార్యక్రమాలు, ర్యాలీలు, ప్రచారాలు చేస్తున్నారు. 2025, ఏప్రిల్ 22తో ఎర్త్ డే 55వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. దీంతో మంచి థీమ్‌ని తెరపైకి తీసుకొచ్చారు.
2025 ఎర్త్ డే థీమ్
ప్రతి సంవత్సరం ఎర్త్ డే సందర్భంగా ఓ కొత్త థీమ్‌ని తెరపైకి తెస్తారు. ఈ ఏడాది మన శక్తి – మన గ్రహం (Our Power, Our Planet) అనే థీమ్‌తో వచ్చారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పత్తి విద్యుత్ సామర్థాన్ని మూడింతలు పెంచడమే దీని లక్ష్యం. విద్యుత్ ఆదా చేస్తూ కూడా పర్యావరణానికి మేలు చేయవచ్చని చెప్తూ ఈ థీమ్‌ని తీసుకొచ్చారు.
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ఇప్పటికే ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. దానికి ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ ఉపయోగించవచ్చు. అలా ప్లాస్టిక్‌కి ఆల్ట్రనేటివ్‌గా వివిధ వస్తువులు ఉపయోగించవచ్చు. 2040 నాటికి ప్లాస్టిక్ రహిత భూమిని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
ఎర్త్ డే నిర్వహించడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుంది. దీనివల్ల భూమిని కాపాడుకోవాలన్న బాధ్యత పెరుగుతుంది. ప్రభుత్వ సంస్థలు, ప్రజలు కలిసి భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే భావను పెంచుతుంది. ఈ ఎర్త్ డే సందర్భంగా చాలామంది వృక్షాలు నాటుతారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుతారు. ఇది మిగిలిన వారిలో అవగాహన కల్పిస్తుంది.