టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. హీరో తనీశ్ ఈ రోజు విచారణకు హాడరయ్యాడు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘనపై తనీశ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది ఈడీ. కెల్విన్‌తో ఉన్న సంబంధాలు, ఎఫ్ క్లబ్‌తో ఉన్న పరిచయాలపై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే తనీష్‌కు నోటీసులు జారీ చేసిన ఈడీ బ్యాంకు ఖాతాలను వెంట తేవాలని పేర్కొంది. కెల్విన్ సమక్షంలో తనీష్‌ను సుధీర్ఘంగా విచారించే అవకాశం ఉంది.
అయితే తనకు నోటీసులు జారీచేయడంపై ఈ హీరో ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రగ్స్ కేసును 2017లోనే పూర్తి చేసిన అధికారులు..ఈడీ పేరుతో మళ్లీ నోటీసులు జారీ చేయడం ఆవేదన కలిగించిందన్నాడు. ఈడీ అడిగే బ్యాంకు వివరాలన్నీ అందజేస్తానని.. తన ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు పూర్తిగా తెలుసన్నాడు. అన్ని వివరాలు చెబుతానన్న తనీశ్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన కెల్విన్ తో తనకుఎలాంటి పరిచయం లేదని స్పష్టం చేశాడు.
Also Read:19న ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్.. ఎస్ఈసీ నోటిఫికేషన్..
డ్రగ్స్ కొనుగోలు చేశారన్న ఆరోపణలతో గత నెల చివరి వారంలోనే 12 మంది తెలుగు సినీనటులకు నోటీసులు అందించింది ఈడీ. ఇప్పటివరకు డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రవితేజ, రానా, నవదీప్, ముమైత్ ఖాన్ ను ఈడీ ప్రశ్నించింది. బుధవారం విచారణకు హాజరైన ముమైత్ నుంచి డ్రగ్ పెడ్లర్ కెల్విన్ కు భారీగా డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. 2015 నుంచి ఇప్పటివరకు ముమైత్ పేరు మీదున్న బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుని రావాల్సిందిగా ముమైత్ కు ముందే ఆదేశించారు. డ్రగ్స్ వ్యవహారంలో గతంలో కూడా ఈడీ దాదాపు ఆరుగంటల పాటూ విచారించింది. మనీలాండరింగ్ చుట్టూనే ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.
ముమైత్ కన్నా ముందు నవదీప్ ను 9 గంటల పాటూ అధికారులు ప్రశ్నించారు. అతని బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, కెల్విన్ తో పరిచయం... ఇలా చాలా విషయాల గురించి ఆరా తీశారు. నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ మేనేజర్ విక్రమ్ ను కూడా విచారించారు. ఎక్సైజ్ శాఖ్ దర్యాప్తు ఆధారంగా డ్రగ్ పెడ్లర్ కెల్విన్ పై ఆరు నెలల క్రితం ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం లొంగిపోయిన కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈడీ అధికారులు నటీనటులకు నోటీసులు పంపినట్టు సమాచారం. సెప్టెంబర్ 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నాడు. మొత్తంగా ఈ విచారణ అనంతరం ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.
Also Read: ఏపీలో నాలుగు రోజులు.. తెలంగాణలో మూడు రోజుల వరకు వర్షాలు
Also Read: శశిథరూర్‌పై రేవంత్ లూజ్ టాక్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !
Also Read:కోహ్లీకి పొగపెట్టారా? ఎందుకు దిగిపోవాలనుకున్నాడు? కారణాలేంటి?