ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 19న (ఆదివారం) పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్ఈసీ) నిర్ణయించింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభించనున్నట్లు తెలిపింది. అదో రోజు లెక్కింపు ముగియగానే ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు సందర్భంగా కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఎక్కడా విజయోత్సవాలు నిర్వహించరాదని ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు రేపు (ఈ నెల 18వ) సాయంత్రం 5 గంటల్లోగా కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు అందించాలని సూచించారు.  


నేడు ఏర్పాట్లపై చర్చ..
ఏపీలో పరిషత్ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లపై ఇవాళ (సెప్టెంబర్ 17) ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో ప్రభుత్వ సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. ఇందులో ఏయే అంశాలను చర్చించాలనే ఎజెండా ఇప్పటికే జిల్లా అధికారులకు చేరింది. నిన్న హైకోర్టు తీర్పు వెలువడే సమయానికి ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఢిల్లీలో ఉన్నారు. తీర్పు వెలువడగానే హుటాహుటిన రాష్ట్రానికి బయల్దేరి సాయంత్రానికి విజయవాడ చేరుకున్నారు. 


ఎన్ని స్థానాలకు పోలింగ్ జరిగిందంటే?
ఏపీలో ఏప్రిల్‌ 8న మొత్తం 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం ఎంపీటీసీ స్థానాల సంఖ్య 10,047గా ఉంది. వీటిలో 2,371 ఏకగ్రీవమయ్యాయి. మరో 375 స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. 81 స్థానాల్లో అభ్యర్థులు మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది. ఏపీలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 126 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎనిమిది చోట్ల ఎన్నికలు జరగలేదు. 11 చోట్ల అభ్యర్థులు మరణించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 


హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు రద్దు.. 
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు హైకోర్టు నిన్న తీర్పు వెలువరించింది. పరిషత్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం అనుమతించింది. దీంతో ఓట్ల లెక్కింపునకు మార్గం సుగుమమైంది. 


Also Read: MPTC ZPTC Elections : ఎన్నో వివాదాలు.. పిటిషన్లు ! ఇక పరిషత్ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకు చేరుతుందా..?


Also Read: Petrol-Diesel Price, 17 September 2021: ప్రధాన నగరాల్లో స్థిరంగా ఇంధన ధరలు... తెలంగాణలో తగ్గి, ఏపీలో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ్టి ధరలు ఇలా...