విరాట్ కోహ్లీ.. ప్రపంచం మెచ్చిన పరుగుల రారాజు. అభిమానులు మెచ్చిన నాయకుడు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగే భారత కెప్టెన్. కానీ హఠాత్తుగా అందరినీ విస్మయపరిచాడు. పొట్టి క్రికెట్ జట్టు పగ్గాలు వదిలేస్తున్నానని ప్రకటించాడు. ఉన్నట్టుండి తన నిర్ణయంతో భారత క్రికెట్‌ను కుదిపేశాడు. అసలెందుకిలా చేశాడు? ఈ అడుగుల వెనక ఆంతర్యం ఏంటి? దారి తీసిన పరిస్థితులు ఎలాంటివి?
హఠాత్తేమీ కాదు!
టీమ్‌ఇండియాకు విరాట్ కోహ్లీ వెన్నెముక అని చెప్పడంలో సందేహం లేదు. అతనాడితే పరుగుల వరద పారుతుంది. మైదానంలో చురుగ్గా కదులుతుంటే చిరుత పులే గుర్తొస్తుంది. ప్రత్యర్థిని కవ్విస్తుంటే మైదానంలో ఆటగాళ్లకు ఊపొస్తుంది. అభిమానులకు ముచ్చటేస్తుంది. అతడి వైఖరే అతడి బలం. నువ్వెంతంటే నువ్వెంత అనే అతడి దూకుడుతోనే నాయకుడిగానూ మెప్పించాడు. అనూహ్య విజయాలు అందించాడు. ఎవరూ ఊహించిన సమయంలో ప్రపంచకప్‌నకు ముందు టీ20 కెప్టెన్సీ వదిలేశాడు. అయితే ఇదేమీ హఠాత్పరిణామం కాదు! ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
Also Read: షాక్.. షాక్.. షాక్! టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లీ
విరామం లేకుండా
పనిభారం ఎక్కువ అవుతోందనే టీ20 పగ్గాలు వదిలేస్తున్నా అన్న మాట కొందరికి అసంబద్ధంగా అనిపించొచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ స్థాయి అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లతో సమానంగా ఉంటుంది. తిరుగులేని దేహదారుఢ్యం అతడి సొంతం. అయితే పనిభారమూ నిజమే. ఐదారేళ్లుగా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. జట్టు ఎంపిక, వ్యూహ రచన, వాటి అమలు సామాన్యమైన విషయమేమీ కాదు. అసలు అంతర్జాతీయ క్రికెట్లో ఈ తరంలో మూడు ఫార్మాట్లకు సారథ్యం వహిస్తున్న క్రికెటర్లు అత్యంత అరుదు. కెప్టెన్‌గా అతడు సెలవులు తీసుకున్నదీ తక్కువే. ప్రతి సిరీసు, ప్రతి మ్యాచు ఆడేందుకే అతడు మొగ్గు చూపాడు. కేవలం ఒకట్రెండు సందర్భాల్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. ఎడతెరపి లేని పనిభారం ఒక కారణం.
టెస్టులంటే ఇష్టం!
వాస్తవంగా సంప్రదాయ క్రికెట్‌ను విరాట్ కోహ్లీ అమితంగా ఇష్టపడతాడు. అతడికి సుదీర్ఘ ఫార్మాట్ అంటే ప్రాణం. దానికే ఎక్కువ విలువిస్తాడు. సాధారణంగా ఈ ఆటలోని ఏ క్రికెటర్‌కైనా టెస్టు క్రికెట్టే పరమావధి. ఆ తర్వాతే వన్డే, టీ20లు. చాలామంది మాజీ క్రికెటర్లు టెస్టులకు కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ అని పొగిడారు. ఆ రెండు ఫార్మాట్లపై మరింత దృష్టి సారించాలన్న అతడి నిర్ణయం సముచితమే.
Also Read: టీ20 కెప్టెన్‌గా కొహ్లీ సూపర్ హిట్.. రికార్డుల్లో సరిలేరు విరాట్‌కెవ్వరు
ఫర్వాలేదు.. కానీ!
ఇక టీ20 కెప్టెన్‌గా విరాట్ మంచి విజయాలే అందించాడు. సేన దేశాల్లో ద్వైపాక్షిక టీ20 సిరీసులు కైవసం చేసుకున్నాడు. మొత్తంగా 45 మ్యాచులకు సారథ్యం వహించి 27 విజయాలు అందుకున్నాడు. 14 పోటీల్లో ఓడాడు. అతడి విజయాల శాతం 65.11గా ఉంది. ధోనీ తర్వాత టీ20ల్లో ఎక్కువ విజయాలు అందించిన కెప్టెనూ అతడే. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం అతడు విజయాల బాట పట్టలేదు. ఇది అతడిని బాధపెట్టేదే!
పోటీకి రోహిత్
భారత క్రికెట్‌కు విరాట్ కోహ్లీ ఒక కన్నైతే రోహిత్ శర్మ రెండో కన్ను! ప్రస్తుతం వీరిద్దరూ లేని టీమ్‌ఇండియాను అస్సలు ఊహించలేం. అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాడు, నాయకుడిగా రోహిత్ బలమైన ముద్ర వేశాడు. ఇంకా వేస్తున్నాడు. అతడు కోహ్లీకి ప్రధాన పోటీదారుగా మారాడన్నది నిజం. అనేక సందర్భాల్లో ఎంతోమంది హిట్‌మ్యాన్ నాయకత్వ శైలి అచ్చం ఎంఎస్ ధోనీని తలపిస్తుందని ప్రశంసించారు. పొట్టి క్రికెట్లో విజయాలకు అవసరమైన అన్ని వ్యూహాలు అతడి వద్ద ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడి విజయాలే ఇందుకు నిదర్శనం. కెప్టెన్‌గా అతడు ముంబయి ఇండియన్స్‌ను ఏకంగా ఐదుసార్లు విజేతగా నిలిపాడు. కోహ్లీ గైర్హాజరీలో భారత జట్టును విజయవంతంగా నడిపించాడు. కెప్టెన్‌గా నిరూపించుకొన్నాడు. ప్రశాంతంగా ఉంటూ.. ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ.. సందర్భానికి తగినట్టు మార్పులు చేస్తూ.. బెస్టు టీ20 కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. కోహ్లీ నిర్ణయానికి ఇదీ ఒక కారణమే.
Also Read: ఇంగ్లాండ్లో యాష్‌కు చోటివ్వనందుకు బుజ్జగించే ప్రయత్నమేమో.. సన్నీ సందేహం!
ఇద్దరు కెప్టెన్లకు జై!
ఒకప్పుడు స్ల్పిట్ కెప్టెన్సీకి బీసీసీఐ గట్టి వ్యతిరేకి. అసలు ఇందుకు ఏ మాత్రం అంగీకరించేది కాదు. కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇద్దరు కెప్టెన్ల విధానం విజయవంతం అవుతోంది. ఫలితాలూ కనిపిస్తున్నాయి. బహుశా ఇదీ కోహ్లీ నిర్ణయం తీసుకొనేందుకు ఒక కారణం కావొచ్చు. ఇంగ్లాండ్ ఇదే విధానంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలిచింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో బలమైన జట్టుగా మారింది. ఆస్ట్రేలియా గతంలోనే అద్భుతాలు చేసింది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి జట్లూ దీనినే అనుసరిస్తున్నాయి. భవిష్యత్తులో కెప్టెన్లను తయారు చేసేందుకూ ఇది పనికొస్తుంది.
చాలా విమర్శలు
పరిమిత ఓవర్ల క్రికెట్లో బ్యాట్స్‌మన్‌గా ఎన్ని ప్రశంసలు పొందాడో కెప్టెన్‌గా అన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు కోహ్లీ. చాలా సందర్భాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని మాజీలు విమర్శించారు. ఆటగాళ్లను తరచూ మారుస్తూ వారు ఆత్మవిశ్వాసం కోల్పోయేలా చేస్తాడన్న అపప్రదా ఉంది. వికెట్లు అవసరమైనప్పుడు, కొన్ని కీలక సమయాల్లో జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్‌నూ పట్టించుకోకుండా అవాక్కయ్యేలా చేశాడు. ఎన్నోసార్లు వాతావరణం, పిచ్‌ల స్వభావం పట్టించుకోకుండా ఓటమికి కారకుడయ్యాడన్న విమర్శలూ ఉన్నాయి. ఐపీఎల్‌లో 13 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నా.. కొన్నేళ్లుగా సారథ్యం వహిస్తున్నా అతడు టైటిల్ అందించలేకపోయాడు. లీగ్ మొదలైన ప్రతిసారీ అతడికి రోహిత్‌తో పోలికలు వచ్చేవి. కోహ్లీ పగ్గాలు వదిలేసేందుకు ఇవన్నీ కారణాలే.