ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఎత్తులో పశ్చిమ / నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఏపీలో పలు చోట్ల రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక రాయలసీయలో కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు లేదా తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రేపు (శనివారం), ఎల్లుండి (ఆదివారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది.
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా కారణంగా తెలంగాణలో నేడు (సెప్టెంబర్ 17) పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాల్ పల్లి, ములుగు, ఆదిలాబాద్, పెద్దపల్లి, కొమురంభీమ్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
మండుతున్న ఎండలు..
తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మధ్యాహ్నం వరకు భారీ ఎండ అంతలోనే చిరుజల్లులు పడటం వంటివి జరుగుతున్నాయి. ఇక నిన్న (సెప్టెంబర్ 16) ఏపీలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా తిరుపతిలో 37.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. నెల్లూరులో 37.5 డిగ్రీల సెల్సియస్, కావలిలో 37.2 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 36.5 డిగ్రీలు, కడపలో 35.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది.