భార్యాభర్తలు వరసలు మార్చేసుకొని అన్నా చెల్లెళ్లుగా చెలామణి అయిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. ఇలా వరసలు మార్చేసుకొని వారు ఏకంగా బ్యాంకునే బురిడీ కొట్టించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చెల్లింపులు సమయంలో బ్యాంకు అధికారులకు వీరిపై అనుమానం వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ వ్యవహరంలో అసలు విషయాలను పోలీసులు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన దొండపాటి పవన్, ప్రభావతి దంపతులు. పవన్ తన పేరును పల్లా వెంకటేశ్వర్లుగా మార్చుకున్నాడు. అనంతరం ప్రభావతితో కలిసి నరసరావు పేట మండలం పెట్లూరివారి పాలెం వచ్చి అన్నా చెల్లెళ్లుగా ఉంటున్నారు.
ఈ క్రమంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరంలో రెండు సర్వే నంబర్లలో 4.73 ఎకరాలు, 4.62 ఎకరాలు తమ పూర్వీకుల నుంచి సంక్రమించినట్లుగా సంతమాగులూరు తహశీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాలు పొందారు. ఈ ప్రక్రియలో కర్రావుల మునయ్య, గుర్రం చిన్న మల్లికార్జునరావు అనే వ్యక్తులు వీరికి సాయం చేశారు. తర్వాత నరసరావుపేట మండలం ఉప్పలపాడులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో 2020లో ఒక్కొక్కరు 4.50 లక్షల చొప్పున మొత్తం 9 లక్షల రుణం పొందారు. వీరు కిస్తీలు కట్టకపోవడంతో అనుమానం వచ్చిన ప్రస్తుత బ్యాంకు మేనేజర్ సిబ్బంది పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి మోసానికి గురైనట్లుగా తెలుసుకున్నారు.
Also Read: Minister Perni Nani: మీకు సినిమా తప్ప వేరే యావ లేదా.. మంత్రి పేర్ని నాని అసహనం
గత ఏడాది నవంబరులో బ్యాంకు మేనేజర్ పల్లె పోగు అంకిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్, ప్రభావతిలకు మునయ్య, మల్లికార్జునరావుతో పాటు సరిమళ్ల జ్యోతిబాబు, సంతమాగులూరు తహశీల్దార్ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ కిషోర్ సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో నిందితులైన పవన్, ప్రభావతి, మునయ్యలను అరెస్టు చేసి వారి నుంచి 9 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Bandi Sanjay : ఫ్రంట్ లేదు టెంట్ లేదు.. ఏ క్షణమైనా కేసీఆర్ జైలుకు వెళ్తారన్న బండి సంజయ్ !
Also Read: MP Raghurama: ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు.. హైదరాబాద్‌లోని ఇంటి ఎదుట హడావుడి
Also Read: అది గుడ్ జోక్ కాదు... సైనా నెహ్వాల్‌కు సిద్ధార్థ్ సారీ! అయితే... ఆ ఒక్కటీ ఒప్పుకోలేదు!